ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

పాస్ అక్కర్లేదు…ఎందుకంటే..!

లాక్ డౌన్ కష్టాల నుంచి రాష్ట్ర ప్రజలకు కొంతమేర ఉపశమనం లభించింది. జిల్లాలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్లే వారికి పాస్ లు తీసుకోవాల్సిన అవసరం ఇకపై లేదు. రాష్ట్రంలో పాస్ లేకుండా ఎక్కడికైనా స్వేచ్ఛగా తిరిగే అవకాశం ప్రజలకు లభించింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, జిల్లా నుంచి మరో జిల్లాకు వెళ్ళడానికి ఎటువంటి అనుమతి పత్రాలు, పాస్ లు అవసరం లేదని పోలీసు శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకూ ప్రజలు ప్రయాణాలు చేయాలంటే తప్పనిసరిగా పాస్ తీసులివాల్సి ఉంది. లేనిపక్షంలో పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపిస్తున్నారు.

రాష్ట్రంలో ప్రజలు కొందరు “వ్యక్తిగత అవసరాలకు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతున్నాము, పాస్ తీసుకోవాలా” అంటూ ఏపీ పోలీస్ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రశ్నించగా పాసులు అవసరం లేదని పోలీసు శాఖ సమాధానం ఇచ్చింది. దీంతో ఇన్నాళ్ల లాక్ డౌన్ కారణంగా ఇళ్లలోనే ఉన్న ప్రజలకు బయటకు వెళ్లేందుకు కొంత వెసులుబాటు లభించినట్లయ్యింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లేవారు మాత్రం అధికారుల నుంచి అనుమతి పత్రాలు తప్పని సరిగా తీసుకోవాల్సి ఉంటుంది.