తెలంగాణరాజకీయాలు

కరోనాపై పట్టింపేది?

Corona impactకరోనా రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రజల ప్రాణాలను బలిగొంటోంది.సెకండ్ వేవ్ మొదలయ్యాక వందలాది మంది తమ ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదు. ఇంకా కరోనాపై భయపడొద్దని హితవు చెబుతోంది. మొదటి వేవ్ అప్పుడు లాక్ డౌన్ ఒక్కటే మార్గమని చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారు. ఆర్థిక వ్యవస్థపై ఉన్న మమకారంతో వైరస్ నిరోధానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఫలితంగా కరోనా మహమ్మారి విస్తరిస్తోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా శరవేగంగా వ్యాపిస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వం తన పంథా మార్చుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కరోనా నిర్మూలన ఎలా సాధ్యమవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణలో అంతగా లేని ప్రభావం
తెలంగాణలో వైరస్ ప్రభావం అంతగా లేదని సీఎస్ సోమేశ్ కుమార్ విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ సైతం కరోనాపై ఎలాంటి ఆంక్షలు ఉండవని తేల్చి చెప్పడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. వందలాది మందిని పొట్టన పెట్టుకుంటున్న వైరస్ ను ఎలా నిరోధిస్తారోనని తర్జనభర్జన పడుతున్నారు. లాక్ డౌన్ విధిస్తే ఆర్థికంగా నష్టపోతామనే భావంతోనే ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ఫలితంగా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ప్రజల ప్రాణాలనే హరిస్తోంది.

కట్టడి చర్యలేవి?
కరోనా మహమ్మారిపై ఏ రకమైన ఆంక్షలు విధించని స్టేట్ల లో తెలంగాణ ముందుంటుందని తెలుస్తోంది. మిగతా ప్రాంతాలు లాక్ ౌన్ విధిస్తూ కరోనా కట్టడికి చర్యలు చేపడుతున్నా తెలంగాణ మాత్రం నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తోందని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం కరోనా వైరస్ నిరోధానికి పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తించడం లేదు. దీంతో మిగతా ప్రాంతాలతో పోలిస్తే వెనుకంజలో ఉందని తెలుస్తోంది. కేవలం ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందనే ముందస్తు చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

గుణపాఠం నేర్వని వైనం
తెలంగాణ కరోనా విషయంలో ఇప్పటికీ గుణపాఠం నేర్వలేదు. మొదటి వేవ్ లో చూపిన శ్రద్ధ రెండో వేవ్ లో ఎందుకు చూపడం లేదో స్పష్టం కావడం లేదు. సీఎం కేసీఆర్ సొంత ప్రయోజనాల కోసమే లాక్ డౌన్ ఊసు ఎత్తడం లేదు. దీంతో సామాన్యులే సమిధలవుతున్నారు. తమ ప్రాణాలు బలిపెడుతున్నారు. కట్టడి లేకపోవడంతో విచ్చలవిడి తనం పెరిగి వైరస్ రోజురోజుకు ఉధృతం అవుతోంది. ఫలితంగా ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల ప్రాణాలంటే లెక్క లేదా అని ప్రశ్నిస్తున్నారు.

Back to top button