తెలంగాణరాజకీయాలు

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీవీ కూతురు వాణిదేవి : కేసీఆర్‌‌ వ్యూహం అదేనా

Vani Devi
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ రాజకీయాల్లో అపర చాణక్యుడు. అందులో నో డౌట్‌. ఆయన ఎత్తులు వేస్తే ప్రతిపక్షాలు సైతం సైలెంట్‌ అవ్వాల్సిందే. ప్రతిపక్ష లీడర్లను ఎలా లొంగదీసుకోవాల్నో కూడా తెలిసిన నేత ఆయన. అందుకే.. ఏ ఎత్తును ఎప్పుడు ప్రదర్శించాలో ఆయనకు బాగా తెలుసు. ఇప్పుడు మరోసారి ఆయన ఆలోచనతో ప్రతిపక్షాలకు చెక్‌ పెట్టేశారు.

Also Read: మరో ప్రాంతాన్ని చేజిక్కించుకుంటున్న బీజేపీ: పుదుచ్చేరిలో కూలిన కాంగ్రెస్ ప్రభుత్వం..

నిన్నా మొన్నటివరకు హైదరాబాద్‌–రంగారెడ్డి–మహబూబ్‌నగర్‌‌ ఎమ్మెల్సీ స్థానానికి అసలు టీఆర్‌‌ఎస్‌ పార్టీలో బరిలో నిలిచే అవకాశాలు లేవని అందరూ అనుకున్నారు. కానీ.. అనూహ్యంగా తమ పార్టీ సైతం బరిలో నిలుస్తుందని కేసీఆర్‌‌ ప్రకటించేశారు. అంతేకాదు ఏకంగా అభ్యర్థిని కూడా అనౌన్స్‌ చేసేశారు. ఈ ఎమ్మెల్సీ స్థానానికి మాజీ ప్రధాని, దివంగత పీవీ నరసింహారావు కూతురు వాణిదేవిని టీఆర్‌‌ఎస్‌ ఖరారు చేసింది. వాణీదేవి నేడు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. పీవీ నరసింహారావు వారసులంతా చాలాకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ అనూహ్యంగా పీవీ వారసుల గురించి తెరపైకి తేవడమే కాదు.. తగిన విధంగా గౌరవిస్తామని ప్రకటించి కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు.

ఈ నేపథ్యంలో కొందరు పీవీ కూతురు సురభి వాణిదేవిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేస్తారని ప్రచారం చేశారు. అయితే.. దుబ్బాక ఉప ఎన్నిక రావడం.. ఆ వెంటనే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగడంతో కేసీఆర్ సైలెంట్ అయినట్లు కనిపించారు. ఈ రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ చావు దెబ్బతినడంతో ఆ పార్టీ తరపున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఆశించిన వారంతా సైలెంట్ అయ్యారు. దీంతో సీఎం కేసీఆర్ అనూహ్యంగా పీవీ నరసింహారావు కుమార్తెను వెంటనే తెరపైకి తెచ్చారు. మాదాపూర్‌‌లోని శ్రీ వెంకటేశ్వర ఫైన్ ఆర్ట్స్ కాలేజీ విద్యా సంస్థల వ్యవస్థాపకురాలైన సురభి వాణిదేవి విద్యా రంగంలోనే కొనసాగుతుండడంతో పట్టభద్ర ఎమ్మెల్సీకి ఆమెనే సరైన అభ్యర్థి అవుతుందని కేసీఆర్ అంచనా వేసినట్లు తెలుస్తోంది. పీవీ నరసింహారావు కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోవడంతో తానే గుర్తింపు కల్పించాలని నిర్ణయించినట్లు ప్రకటించుకున్న కేసీఆర్.. పీవీ వారసులకు పెద్దపీట వేయడం ద్వారా కాంగ్రెస్ తోపాటు.. బీజేపీని కూడా దెబ్బతీయొచ్చని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: పాత ఫార్ములా పైనే కేసీఆర్‌‌ ఫోకస్‌ : ఆ రెండు పార్టీలకు చెక్‌

కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధానమంత్రిగా పని చేసిన నాయకుడి కుమార్తె వాణిదేవి. అందువల్ల కచ్చితంగా ఆ పార్టీ కాస్త ఇరుకునపడుతుంది. ఇక బీజేపీ సంగతి కూడా అలాగే ఉంది. బీజేపీ అంటే ఇష్టపడే సామాజిక వర్గానికి చెందిన వాణికి సహజంగా ఆ వర్గం నుంచి ఆదరణ ఉంటుంది. అలాగే పీవీ అంటే వర్గాలు, పార్టీలకతీతంగా అభిమానించేవారు ఉన్నారు. పట్టణ ఓటర్లు, యువతలో కూడా పీవీ అంటే అభిమానించేవారు ఇప్పటికీ ఉన్నారు. వీరు సహజంగా బీజేపీ అంటే కూడా అభిమానంతో ఉంటారు. వీరందరినీ డైలామాలో పడేయడం లేదా ఈ ఓట్లలో చీలిక తీసుకరావడం కేసీఆర్ ప్లాన్ అని చెప్పొచ్చు. కేసీఆర్ ఎత్తుగడ అయితే వేశారు.. కానీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఒకప్పుడు మేధావులు, ఎక్కువ చదువుకున్న వారికి అవకాశం ఉండేది. ఇప్పుడంతా మారిపోయింది. అక్కడా కులాలు, సమతూకాలు ఇలాంటి వ్యవహారాలు నడుస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో కేసీఆర్‌‌ వేసిన ఎత్తులు ఏ మేరకు ఫలాలిస్తాయో చూడాలి.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Back to top button