జాతీయంరాజకీయాలుసంపాదకీయం

కాశ్మీర్ పై పాకిస్తాన్ కధ కంచికే

గిల్గిత్-బాల్టిస్తాన్ పాకిస్తాన్ అయిదో ప్రావిన్స్ అట

పాకిస్తాన్ ఎప్పుడూ దుస్సాహసానికి పాల్పడి తన నాశనాన్ని తనే చేసుకుంటుంది. 1948 లో ఆదివాసుల్ని రెచ్చగొట్టి కాశ్మీర్ ని కబళించాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టినా తన బుద్ది మారలేదు. బ్రిటీష్ అధికారుల పరోక్ష సాయం తో కాశ్మీర్ లో కొంతభాగాన్ని తన ఆక్రమణ లోకి తెచ్చుకున్నసంగతి తెలిసిందే. అందులో ప్రస్తుత మన సరిహద్దుకి ఆనుకొనివున్న పశ్చిమ భాగానికి ఆజాద్ కాశ్మీర్ పేరు పెట్టింది. ఉత్తరాన వున్నగిల్జిట్, బాల్టిస్తాన్, మరికొన్ని సంస్థానాలను కలిపి గిల్జిట్-బాల్టిస్తాన్ గా నామకరణం చేసింది. వాస్తవానికి ఈ ఉత్తర ప్రాంతాలన్నీ మన లడక్ లో భాగమే. ఇక్కడనుంచే హిమాలయ కనుమలగుండా చైనా కు, మధ్య ఆసియా దేశాలకు దారి వుంది. ఈ ఉత్తర ప్రాంతం లోని బాల్టిస్తాన్ లో భాగమైన షుమారు ఐదువేల చదరపు కిలోమీటర్లు చైనాకు దారాదత్తం చేసింది. తనది కాని భూమిని ఆక్రమించటమే కాకుండా ఇతరులకు దానం కూడా చేసిన దుష్ట చరిత్ర దీనికి వుంది. అయినా దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు కాశ్మీర్ కి అన్యాయం జరిగిందని జోక్యం చేసుకోవాలని ప్రపంచం మొత్తం ప్రచారం చేస్తుంది. మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేయాలని గత 70 ఏళ్ళ నుంచి చేస్తున్న ప్రయత్నం సఫలం కాకపోగా సగభాగానికి పైన జనాభా వున్న బంగ్లాదేశ్ ప్రజల్ని పోగొట్టుకున్నా బుద్ది రాలేదు. కాశ్మీర్ పై మొసలి కన్నీరు కారుస్తూనే వుంది. కానీ అదంతా బూటకమని కాశ్మీర్ ప్రజలు మెల్లి మెల్లిగా అర్ధం చేసుకుంటున్నారు. ఇప్పుడు పూర్తిగా కాశ్మీర్ ప్రజలకు టోపీ పెట్టే పని మొదలుపెట్టింది.

గిల్జిట్-బాల్టిస్తాన్ ప్రజల అణచివేత 

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో భాగమైన ఉత్తర ప్రాంతాలకు మొదట్నుంచీ అన్యాయం చేస్తూనే వస్తుంది. పాకిస్తాన్ లో మెజారిటీ ప్రజలు సున్నీ తెగకు చెందినవారు, కానీ గిల్జిట్-బాల్టిస్తాన్ ప్రజలు షియా తెగకు చెందినవారు. 1948 లో బ్రిటీష్ అధికారి సహాయంతో ఆక్రమించుకున్న ఈ ప్రాంతాన్ని పశ్చిమ ప్రాంతం లోని ఆజాద్ కాశ్మీర్ తో కలపకుండా మొదట్లోనే పాకిస్తాన్ కుట్ర పన్నింది. 1949 లోనే ఆజాద్ కాశ్మీర్ తో కరాచీ లో రహస్య ఒప్పందం చేసుకొని ఉత్తర ప్రాంతాల్ని దానినుంచి విడదీసింది. ఆ తర్వాత ఈ ప్రాంత ప్రజలకి కనీస ప్రాధమిక హక్కులు లేకుండా మిలిటరీ అధికారం తో పరిపాలించింది. ఈ రోజు మనమేదో జమ్మూ-కాశ్మీర్ ప్రాంతాన్ని రెండు భాగాలు చేసామని నానా యాగీ చేసే పాకిస్తాన్ తన కింద వున్న కాశ్మీర్ ని 1949 లోనే విడదీసిన సంగతి, అదీ అత్యంత రహస్యంగా ( ఈ ఒప్పందం 1990ల్లోగానీ బయటకు రాలేదు)  ఉంచిన విషయాన్ని ప్రపంచం మరిచిపోయిందని అనుకుంటుంది. 21వ శతాబ్దం దాకా అంటే దాదాపు 50 సంవత్సరాలు అక్కడి ప్రజలకు ఎటువంటి ప్రాధమిక హక్కులు లేకుండా మిలిటరీ పరిపాలన కింద అణిచివేసింది. ఈ రెండు దశాబ్దాల్లోనే మెల్లి మెల్లిగా పరిమిత అధికారాలు గల శాసన వ్యవస్థని ఏర్పాటు చేసింది. దానికి ముందుగా అక్కడ జనాభాలో మార్పులు తీసుకొచ్చింది. షియా ల మెజారిటీ ని మార్చటానికి సున్నీలను, పఠాన్ లను గిల్జిట్-బాల్టిస్తాన్ ప్రాంతం లోకి తరలించి షియా లను మైనారిటీ గా తమ స్వంత గడ్డలోనే మార్చింది.

అంతేకాదు వాళ్ళ ప్రజల సంస్కృతిని మార్చటానికి కూడా తీవ్ర ప్రయత్నం చేసింది. ప్రస్తుతం చైనా-పాకిస్తాన్ ఆర్ధిక నడవా పేరుతో లక్షలమంది చైనీయులను తీసుకొచ్చి ఈ భూభాగం లో ఉంచింది. నదులపై ఆనకట్టలు, ప్రాజెక్టులు, హైవే నిర్మాణం పేరుతో వాళ్ళ నీళ్ళు, భూభాగాన్ని బలవంతంగా చైనీయులకు అప్పగించాటాన్ని, వాళ్ళ భూభాగం లోనే వాళ్ళను రెండో తరగతి పౌరులు గా మార్చటాన్ని స్థానికులు నిరసిస్తున్నారు. కొంతమంది చైనీయుల పై దాడులు కూడా చేయటం జరిగింది. దానితో చైనీయులను రక్షించటానికి కొన్నివేల సైన్యం నిత్యం పహారా కాస్తుంది. అయినా దాడులు ఆగడం లేదు.

చైనా కోసం కాశ్మీర్ సమస్యను తాకట్టు పెట్టింది

చైనా లక్షల కోట్ల పెట్టుబడి పెట్టి ఈ భూభాగం గుండా బెలూచిస్తాన్ లోని గ్వాదర్ పోర్టు కి రోడ్డు నిర్మిస్తుంది. అయితే అంతర్జాతీయంగా చైనా కు కొన్ని చిక్కులు వచ్చి పడ్డాయి. భారత్ తన భూభాగం లో రోడ్డు నిర్మించటాన్ని తప్పు పట్టింది. అంతర్జాతీయ వేదికలపై ఈ అంశాన్ని లేవనెత్తింది. అదీగాక అంతర్జాతీయ బ్యాంకులు, వాణిజ్య సంస్థలు ఈ చైనా ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వటానికి అభ్యంతరం చెబుతున్నాయి. వివాదాస్పద భూమి పై ఋణం ఇవ్వటానికి సాంకేతికపరమైన ఇబ్బందు లుండటంతో చైనా పాకిస్తాన్ పై ఒత్తిడి పెంచింది. ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్ దేశంలో భాగంగా చూపాలని అప్పుడే చైనా-పాకిస్తాన్ ఆర్ధిక నడవాకి అంతర్జాతీయ అవరోధాలు తొలిగిపోతాయని చెప్పింది. అలా చేస్తే ఐక్యరాజ్యసమితి లో కాశ్మీర్ పై తన వాదన బలహీనపడుతుందని ఇన్నాళ్ళు పాకిస్తాన్ చెబుతూ వచ్చింది. ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో వుండటం తో చైనా ఇదే అదనుగా తమవైపునుంచి ఒత్తిడి పెంచింది.

పాకిస్తాన్ కూడా దీనిపై ముసుగు తొలగించి గిల్జిట్-బాల్టిస్తాన్ ని తమ దేశపు ఐదో ప్రావిన్సు గా ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి, స్థానిక ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని దృష్టి మరల్చటం ( అంటే వాళ్ళను పాకిస్తాన్ పౌరులుగా గుర్తించి , వాళ్లకు మిగతా పాకిస్తాన్ పౌరులతో సమాన హక్కులు కల్పించటం ) ; రెండోది, చైనా ని సంతృప్తి పరచటం.

నట్టేట మునిగిన కాశ్మీర్ ప్రజలు 

ఇన్నాళ్ళ నుంచి భారత్ లోని కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమణ లోని కాశ్మీర్ ప్రాంతాల్ని కలిపి స్వతంత్ర కాశ్మీర్ గా ఏర్పరచాలని జరుగుతున్న ఆందోళనకు తానే కర్త, కర్మ, క్రియగా వ్యవహరిస్తూ కాశ్మీర్ ప్రజల కోసం ఏం చేయటానికైనా సిద్ధమని చెబుతూ ఉగ్రవాదుల్ని మన పైకి ఎగదోసి పైశాచిక ఆనందం పొందుతున్న పాకిస్తాన్ ఇప్పుడు కాశ్మీర్ సమస్యని గంగలో కలిపింది. అంతర్జాతీయ వేదికలపై కాశ్మీర్ గురించి మాట్లాడే నైతిక హక్కు కోల్పోయింది. భారత్ లోని కాశ్మీర్ లోయ లోని ప్రత్యేకవాదులకు ఇది అశనిపాతమే. ఏ మొహం పెట్టుకొని ప్రత్యేక కాశ్మీర్ గురించి ఇకముందు మాట్లాడతారు? అతి పెద్ద భూభాగాన్ని పాకిస్తాన్ కి దారాదత్తం చేసినతర్వాత పాకిస్తాన్ లో మిగిలిన ఆజాద్ కాశ్మీర్ చాలా చిన్న ప్రాంతం. దానికి సంబందించిన ( మీర్పూర్) మాజీ సైనికులే ఎక్కువమంది లండన్ లో స్థిరపడి ఇన్నాళ్ళు భారత్ కి వ్యతిరేకంగా పాకిస్తాన్ కి అనుకూలంగా లేబర్ పార్టీలో తీర్మానాలు పెట్టి, భారత హై కమిషనర్ కార్యాలయం ముందు నిరసనలు చేసి గందరగోళం చేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళ గొంతులు మూగ పోయాయి.పాకిస్తాన్ కి మద్దత్తు గళం లండన్ లో మూగపోయినట్లే.

ఇప్పుడు మిగిలిన ఆజాద్ కాశ్మీర్ ప్రజల మాటేంటి? వాళ్ళు ఇంకా స్వతంత్ర కాశ్మీర్ బూటకపు నినాదం తో భారత్ లోని కాశ్మీర్ ప్రజల్ని మోసం చేయదల్చుకున్నారా? ముందుగా గిల్జిట్-బాల్టిస్తాన్ ని పాకిస్తాన్ నుంచి విముక్తం చేసుకొని భారత్ వైపు వేలేత్తే సాహసం చేయాల్సివుంది. పేరుకు స్వతంత్ర కాశ్మీర్, నిజానికి పాకిస్తాన్ గులాములు. ఈ నిజం  పాకిస్తాన్ చర్యతో కాశ్మీర్ ప్రజలకి, ప్రపంచానికి ఇంకా బాగా తేటతెల్లమయ్యింది. ఇప్పటికైనా కాశ్మీర్ ప్రజలంతా ముక్త కంఠం తో పాకిస్తాన్ నిజస్వరూపాన్ని తెలుసుకుంటారని ఆశిద్దాం.

Back to top button