ఆంధ్రప్రదేశ్గుసగుసలురాజకీయాలు

పంచాయతీల టార్గెట్.. జగన్ నయా రూట్..

Panchayat Election Target .. Jagan New Plan

CM Jagan

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. శుక్రవారం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కాబోతోంది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఏకగ్రీవాల వైపు కసరత్తు చేస్తోంది. మెజారిటీ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యేలా అన్ని వనరులు వినియోగించుకునేలా పావులు కదుపుతోంది. ఏకగ్రీవ సర్పంచులను ఎన్నుకుంటే.. పంచాయతీలకు భారీగా నజరానాలు దక్కనున్నాయి. ప్రభుత్వానికి ఎన్నికల ఖర్చు సైతం తగ్గుతుంది. అయితే దీన్ని.. బీజేపీ .. జనసేన.. టీడీపీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఏకగ్రీవ ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునిచ్చాయి. ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని విపక్షాలు అంటున్నాయి. ఏకగ్రీవాలను నిరోధించడానికి తమవంతు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ విషయాన్ని బీజేపీ.. జనసేన పార్టీలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచరణ్ దృష్టికి తీసుకెళ్లనున్నాయి.

టీడీపీ, బీజేపీ-జనసేన అభ్యంతరాలు.. ఆరోపణలను పట్టించుకోని అధికార వైసీపీ తన పనిని తాను చేసుకెళుతోంది. అత్యధిక పంచాయతీలను ఏకగ్రీవాలతో తమ ఖాతాలో వేసుకోవాలని వ్యూహాలు రూపొందించుకుంటోంది. వైఎస్సార్ సీపీ అధినేత.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. జిల్లా ఇన్ చార్జి మంత్రులకు టార్గెట్లను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒక్కో జిల్లాలో 80 నుంచి 90శాతం మేర పంచాయతీలను గెలుచుకోవాలనే లక్ష్యాన్ని వారికి నిర్దేశించినట్లు సమాచారం. ఏకగ్రీవం సాధ్యంకాని పంచాయతీలపై ఎన్నికల ద్వారా గెలుపు బావుటా ఎగురవేయాలని, దానికి అనుగుణంగా వ్యూహాలు రూపొందించాలని జగన్ వారికి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితంగా నిర్వహించేవే. అయినప్పటికీ.. తాము మద్దతు ఇచ్చే అభ్యర్థులే విజయం సాధించాలనే పట్టుదల మంత్రుల్లో కనిపిస్తోంది. తమ పార్టీ తరఫున పోటీచేసే అభ్యర్థులను గెలిపించుకోవడానికి వ్యూహాలు పన్నుతున్నారు. ఎమ్మెల్యే సహకారంతో పార్టీ బలంతో గెలిచే అవకాశం లేని పంచాయతీలపై ఫోకస్ పెట్టారు. ఇన్ చార్జి మంత్రులు ఈ మేరకు జిల్లాల్లోనే మకాం వేశారు. అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేలా షెడ్యూల్ రూపొందించుకున్నారు.

ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తాము మద్దతిచ్చిన అభ్యర్థులను గెలిపిస్తాయని మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ జిల్లా నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే నవరత్నాలతో సహా మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను 90శాతం మేరకు అమలు చేయడంపై భరోసాతో ఉన్నారు. వలంటీర్ల వ్యవస్థ.. గ్రామ సచివాలయాలు, సకాలంలో పింఛన్ల పంపిణీ.. అన్ని రకాల పథకాలు ప్రవేశ పెట్టడం వంటి చర్యలు తమకు మెజారిటీ పంచాయతీలను తెచ్చి పెడతాయని భావిస్తున్నారు.

Back to top button