ఆంధ్రప్రదేశ్రాజకీయాలుసంపాదకీయం

పవన్ కళ్యాణ్ మళ్ళా మాట్లాడాడు

ఎన్నాళ్లకెన్నాళ్ళకు, తిరిగి మళ్ళా ఎప్పుడు?

2019 లోక్ సభ,అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మధ్యలో ఎప్పుడో కనబడి మెరుపు మెరిసి వెళ్ళిపోయాడు. తిరిగి చాలా రోజుల గ్యాప్ తర్వాత విజయవాడ లో మీటింగ్ పెట్టాడు. బిజెపికి నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు వచ్చిన తర్వాత జనసేన-బిజెపి కలిసి ఆంధ్రలో యాక్టివిటీ చేస్తారని అందరూ అనుకున్నారు. దానికోసం ఎదురుచూసి చాలామందికి కళ్ళు కాయలు కాసాయట. అదేమంటే ఆయన దగ్గర డబ్బులు లేవు కాబట్టి సినిమాలు చేసుకుంటున్నాడని జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు సర్దిపుచ్చు కుంటున్నారని తెలిసింది. పవన్ అభిమానులు నిజంగానే అలా నమ్ముతూ ఉండొచ్చు. కానీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనే వాళ్లకు ఇన్ని రోజులు గైరుహాజరు చాలా నిరుత్సాహాన్ని నింపింది. ఇంతకుముందు బిజెపికి కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వం కొంత నిరుత్సాహాన్ని ఇచ్చినమాట నిజమే. అది నిజమో కాదో కాని ఆయన వున్నప్పుడు బిజెపి తెలుగుదేశం బి టీం గా ముద్రపడింది. కనీసం ఇప్పుడయితే ఆ ముద్రలేదనే చెప్పాలి. దానితో పాటు ఎంతోకొంత చురుకుదనం బిజెపి క్యాడర్ లో సోము వీర్రాజు తీసుకొచ్చాడు. కాకపోతే జతగా జనసేన కార్యకలాపాలు లేకపోవటం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. రాజకీయ పార్టీ అనేది నిరంతరం ప్రజలకు అందుబాటులో వుండాలి, ప్రజా సమస్యలపై గళం విప్పాలి. అన్ని ప్రాంతాలకి నాయకులూ వెళ్ళాలి. ఇవేమీ లేకుండా ఎన్నికలప్పుడే రాజకీయాలు చేస్తామంటే కుదరదు.

పవన్ కళ్యాణ్ పై ఇప్పటికీ క్రేజ్ ఉన్నమాట నిజం 

పవన్ కళ్యాణ్ నిజయితీగల వ్యక్తిగా ఇప్పటికీ పేరుంది. ధన, కుల రాజకీయాలకు విరుగుడుగా ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తానని వాగ్దానం చేసి ఎన్నికలలోకి వచ్చాడు. అంతవరకూ అందరూ హర్షించారు. ఒక రాజకీయపార్టీ నిలదొక్కుకోవాలంటే అదొక్కటే చాలదు. ప్రజల్లో తలలో నాలుకలాగా వుండాలి. నిరంతరం అందుబాటులో వుండాలి. రాజకీయ కార్యక్రమాలు చేస్తూ వుండాలి. ఈ విధంగా కాకుండా మరో విధంగా పార్టీని ప్రజల దగ్గరకు చేర్చలేరు. నెలలతరబడి కనబడకుండా వుంటే ప్రజల్లో అభిప్రాయం మారుతుంది. బిజెపితో కూటమి కట్టి సరైన వ్యూహమే వేశాడని అందరూ అనుకున్నారు. కాని ఫాలోఅప్  చర్యలు తీసుకోకపోవటం అందరికీ నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. క్రేజ్ ని రాజకీయ ఆస్తిగా మార్చుకోవాలనే తపన వుండాలి,అందుకోసం నిరంతరం శ్రమించాలి. కరోనా లో కూడా సోము వీర్రాజు తన కార్యకలాపాలు ఆపలేదు. చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండి కూడా ఏదో ఒకటి చేస్తున్నాడు. మరి పవన్ కళ్యాణ్ చేస్తున్నదేమిటో ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈ మాట అనగానే అభిమానులకి ఎక్కడలేని కోపం వస్తుందని తెలుసు. అంతమాత్రాన చెప్పాలనుకున్నది మనసులో పెట్టుకోకుండా మాట్లాడుకుంటేనే మంచిది. ఇది ఆంధ్రలో మూడో ప్రత్యామ్నాయం రావాలనే ఆరాటంతోనే చెబుతున్న మాట.

క్రేజ్ ని రాజకీయ ఆస్తిగా మార్చుకోవాలంటే ప్రతి పట్టణంలో,వార్డులో,ప్రతి గ్రామంలో జనసేన శాఖలు ఏర్పడాలి. ఇప్పటికీ ఆ నిర్మాణం జరగలేదు. ఏవో కొన్ని ప్రాంతాల్లో తప్పితే ఏర్పడిన శాఖలు కూడా నిరంతరం ప్రజలమధ్య వుండటం లేదు. వాళ్ళు ఆపని చేయాలంటే అధ్యక్షుడు వాళ్లకు ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు ఇవ్వాలి. అవేమీ లేకుండా శాఖలు వాటంతట అవే స్వచ్చందంగా పనిచేయవు. ఇప్పటికైనా ఆ దిశగా చర్యలు చేపడితేనే పార్టీ నిలబడుతుంది,లేకపోతే ఎక్కడవేసిన గొంగళి అక్కడే వుంటుంది.

జిహెచ్ఎంసిలో జనసేన పోటీ అవసరమా?

దీనిపై పవన్ కళ్యాణ్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ముందుగా చెప్పాల్సివస్తే అసలు గుర్తింపు పొందిన క్యాడర్ ఉందా? ఏదో పవన్ కళ్యాణ్ క్రేజ్ తో గెలుద్దామనుకుంటే అది సాధ్యంకాదు. రెండోది, పవన్ కళ్యాణ్ ఈ రెండు వారాలు ప్రచారం చేయబోతున్నాడా? అదేమీ చేయకుండా కేవలం అభ్యర్ధులను నిలబెట్టి గాలికొదిలేస్తే అభాసుపాలు కావటం ఖాయం. ఈ ఫలితం ప్రభావం ఆంధ్ర రాజకీయాలపై పడే అవకాశం వుంది. అందుకనే పోటీలో అభ్యర్ధులను నిలబెట్టేముందు ఒకటికి రెండుసార్లు లోతుగా ఆలోచించి నిలబెట్టాలి. పెద్ద పెద్ద పార్టీలే కెసిఆర్ ముందస్తు ఎన్నికల దెబ్బకు గిల గిలలాడుతుంటే ఎటువంటి సాధన సామాగ్రి లేకుండా ఎన్నికల్లో నామకా పోటీ పెట్టటం గాలిలో దీపం పెట్టటం లాంటిదే. పవన్ కళ్యాణ్ మరొక్కసారి ఆలోచించుకుంటే మంచిది.

Back to top button