జనరల్విద్య / ఉద్యోగాలు

నిరుద్యోగులకు పేపాల్ శుభవార్త.. భారీగా ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ..?

ప్రముఖ సంస్థలలో ఒకటైన పేపాల్ సంస్థ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. కరోనా విజృంభణ తరువాత డిజిటల్ పేమెంట్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో భారీగా ఇంజనీర్లను నియమించుకోవడానికి సిద్ధమైంది. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నైలోని డెవలప్‌మెంట్‌ సెంటర్లలో సంస్థ ఉద్యోగులను నియమించుకోనుంది. పేపాల్‌ తాజాప్రకటనలో ఏకంగా 1,000 మంది ఉద్యోగులను కొత్తగా నియమించుకోబోతున్నామని వెల్లడించింది.

బీటెక్ పాసైన విద్యార్థులకు, ఈ ఏడాది బీటెక్ పాసయ్యే విద్యార్థులకు ఈ వార్త శుభవార్త అనే చెప్పాలి. సాఫ్ట్‌వేర్, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్, బిజినెస్ అనలిటిక్స్ స్ట్రీమ్స్ ఎంట్రీ, మిడ్-లెవల్ , సీనియర్ రోల్స్, డేటా సైన్స్, రిస్క్ అనలిటిక్స్ విభాగాల్లో ఈ ఉద్యోగాల భర్తీ జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలోని మూడు కేంద్రాలలో పేపాల్ సంస్థకు 4,500 మంది ఉద్యోగులు ఉన్నారు. డిజిటల్ చెల్లింపులకు డిమాండ్ పెరగడంతో ఉద్యోగుల సంఖ్యను కంపెనీ పెంచింది.

పేపాల్ సంస్థ ప్రధానంగా వినియోగదారులు, వ్యాపారుల అవసరాలను తీర్చడంపై దృష్టి పెట్టింది. పేపాల్ ఇండియా ప్రతినిధి గురు భట్ మాట్లాడుతూ తాజా ఉద్యోగ నియామకాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. గత నెలలో పేపాల్ సంస్థ భారత వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టనున్నట్టు కీలక ప్రకటన చేసింది. భారతీయ వ్యాపారాలను అంతర్జాతీయంగా విస్తరించేందుకు కృషి చేస్తామని పేపాల్ గతంలో ప్రకటన చేసింది.

మరోవైపు ప్రముఖ కంపెనీలు సైతం ఈ ఏడాది ఉద్యోగులను నియమించుకోబోతున్నట్టు కీలక ప్రకటన చేశాయి. గతేడాది కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల ఉద్యోగ నియామకాలు తక్కువగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది మాత్రం కంపెనీలు భారీగా ఉద్యోగులను నియమించుకోబోతున్నాయి.

Back to top button