తెలంగాణరాజకీయాలు

ఇస్తవా.. చస్తవా? రేవంత్ రెడ్డి కొత్త నినాదం

PCC chief Revanth Reddyకాంగ్రెస్ ఇంద్రవెల్లి దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభపై దృష్టి సారించింది. ఈమేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బంజారాహిల్స్ లోని ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి నివాసానికి మాజీ మంత్రి షబ్బీర్ అలీతో కలిసి వెళ్లారు. ఇంద్రవెల్లి సభ ద్వారా అధికార పార్టీకి వణుకు పుట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ వివిధ అంశాలపై చర్చించింది. హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం కోసమే దళితబంధు పథకం అమల్లోకి తెచ్చిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏదైనా చేయాలంటే ఉప ఎన్నికలు రావాల్సిందేనా అని విమర్శించారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వం పని చేయాలంటే ఉప ఎన్నికలు ఉండాల్సిందేనని భావిస్తుందని పేర్కొన్నారు.

నేటినుంచి సెప్టెంబర్ 17 వరకు నిరసన చేపడతామని చెప్పారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని అన్నారు. రాష్ర్టంలోని దళిత, గిరిజన కుటుంబాలందరికి దళిత బంధు పథకం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఇస్తవా-చస్తవా అని నిలదీయనున్నట్లు వివరించారు. నిరసనకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సెప్టెంబర్ మొదటి వారంలో హాజరవుతారని చెప్పారు. రాష్ర్టంలోని మరో ఐదు ప్రాంతాల్లో ఇంద్రవెల్లి లాంటి బహిరంగసభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

సోమవారం నిర్వహించే బహిరంగ సభతో టీఆర్ఎస్ కు సవాలు విసురుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ఇంద్రవెల్లి దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా విజయవంతం కోసం కలిసి రావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. లక్షకు పైగా జనం హాజరవుతారని పేర్కొన్నారు. దీంతో టీఆర్ఎస్ కు అల్టీమేటం జారీ చేస్తామని అన్నారు.

రేవంత్ రెడ్డి ఊపుతో పార్టీకి బలం పెరిగిందనే చెప్పాలి. నాయకులు, కార్యకర్తలు సమష్టిగా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు నేతలు చర్యలు చేపడుతున్నారు. రాబోయే ఎన్నికలకు కాంగ్రెస్ ను బలోపేతం చేసి ఎలాగైనా అధికారం హస్తగతం చేసుకునే విధంగా వ్యూహాలు ఖరారు చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Back to top button