ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

అధికారివి కాదు.. ఫ్యాక్షనిస్టువు.. నిమ్మగడ్డపై పెద్దిరెడ్డి, సజ్జల నిప్పులు

Peddireddy and Sajjala's harsh remarks on Nimmagadda

ప్రభుత్వ వ్యతిరేకిగా పనిచేస్తున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను వైసీపీ నేతలు ఓ ఆటాడేసుకుంటున్నారు. నిమ్మగడ్డ తీసుకుంటున్న అధికారిక నిర్ణయాలు.. జగన్ అండ్ టీంకు చిర్రెత్తుకొస్తున్నాయి. నిమ్మగడ్డ ఓ ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అంటుంటే.. అధికారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మంత్రి పెద్దరెడ్డి రాంచంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఏపీలోని ప్రభుత్వ అధికారులను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆయన తిరుపతిలో మాట్లాడారు. కోర్టు ఉత్తర్వులు రాగానే ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అనుచరుడిగా ఓ రాజకీయ నాయకుడిలా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. కరోనా ఉన్నప్పటికీ.. కోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నామని అన్నారు. 2002 నుంచే ఏకగ్రీవాల ఎన్నికల ఆనవాయితీ నడుస్తోందని.. ఎన్నికల్లో.. అక్రమాలకు పాల్పకుండా.. 19ఏ చట్టం తెచ్చామని తెలిపారు.

పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుస్తుందనే భయంతోనే ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు.. నిమ్మగడ్డను అంటిపెట్టుకుని ఉన్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. టీడీపీకి ఓట్లు రావనే భయంతోనే ఎస్ఈసీ చెలరేగుతున్నాడని అన్నారు. గ్రామాల్లో గొడవలు లేకుండా పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అభివృద్ధిని ఆకాంక్షించేవారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తోడ్పాటు అందించాలని కోరారు. పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా అందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని మంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పరిధిదాటి వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలో నిమ్మగడ్డ సూత్రధారిగా మారారని విమర్శించారు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అయ్యారని.. అందులో భాగంగానే అధికారులపై దుందుడుకుగా దాడికి సిద్ధమయ్యారని, ఇది ఫ్యాక్షనిస్టు ధోరణిని తలపిస్తోందని తెలిపారు.

Back to top button