అంతర్జాతీయం

ఎయిర్‌ పోర్ట్‌ కు దగ్గరలో కూలిన విమానం 99 మృతి

పాకిస్థాన్‌ కరాచీలోని ఎయిర్‌ పోర్ట్‌ కు 4 కిలోమీటర్ల దూరంలోని మోడల్ కాలనీ సమీపంలో విమానం కుప్పకూలింది. లాహోర్ నుంచి కరాచీ వెళుతున్న పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కరాచీ సమీపంలోని నివాస ప్రాంతాల్లో కుప్పకూలినట్టు స్థానిక మీడియా సంస్థలు తెలిపాయి. ప్రమాదం సమయంలో విమానంలో 99 మంది ఉన్నట్టు…అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో 4 ఇళ్లు దెబ్బతిన్నాయి. భారీ శబ్దంతో పాటు పెద్ద ఎత్తున పొగ రావడంతో జనం పరుగులు తీశారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

అయితే ఈ విమానంలో తాను, తన భర్త మరణించినట్టు సాగిన ప్రచారాన్ని పాకిస్తాన్‌ నటి ఆయేజా ఖాన్‌ తోసిపుచ్చారు. విమాన ప్రమాదంలో తనతో పాటు తన భర్త డానిష్‌ తైమూర్‌ మరణించినట్టు అర్ధం లేని వదంతులను పుట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. అసత్యాలను వ్యాప్తి చేయడం మానుకోవాలని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్‌ చేశారు. ‘దయచేసి సవ్యంగా వ్యవహరించండి..ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ను వ్యాప్తి చేయడం విరమించండ’ని ఆమె కోరారు. కాగా, లాహోర్‌ నుంచి 99 మంది ప్రయాణీకులతో బయలుదేరిన పీఐఏ విమానం కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయ్యే కొన్ని నిమిషాల ముందు కుప్పకూలింది.