తెలంగాణరాజకీయాలు

యాదాద్రి ప్రారంభోత్సవానికి ప్రణాళికలు.. అందుకే కేసీఆర్‌‌ ఆలయాన్ని సందర్శించారా..?

CM KCR
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గురువారం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన యాదాద్రికి వెళ్లారు. ఆలయంలో సీఎం కేసీఆర్‌కు అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత బాలాలయంలో నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు అర్చకులు తీర్థ ప్రసాదాలకు అందజేశారు.

Also Read: పడిపోయిన హైదరాబాద్ గ్రాఫ్‌.. 2014లో 4వ ర్యాంక్.. ఇప్పుడు 24..

అనంతరం యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో కలియ తిరుగుతూ పనులు ఎంత వరకు వచ్చాయో అధికారులను ఆరాతీశారు. స్థపతి ఆనంద్ సాయితో కలిసి అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు సీఎం కేసీఆర్. యాదాద్రి నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. రూ.1200 కోట్ల అంచనా వ్యయంతో 2016 అక్టోబరులో పనులను ప్రారంభించారు.

ఇప్పటి వరకు రూ.850 కోట్ల మేర ఖర్చు చేశారు. 90 శాతానికి పైగా గుడి నిర్మాణ పనులు పూర్తయ్యాయి. యాదాద్రికి నలువైపులా విశాలమైన మాఢవీధులు, సప్త గోపురాలు, అంతర్ బాహ్య ప్రాకారాలు, ఆల్వార్ల విగ్రహాలతో కాకతీయ సంప్రదాయ కృష్ణశిలా శిల్పసౌరభం ఉట్టిపడేలా పనులు జరిగాయి. శివాలయం నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయ్యింది. కొండపై పుష్కరిణి కూడా పూర్తిస్థాయిలో తయారైంది. కొండ కింద భక్తుల సౌకర్యార్థం మరో పుష్కరిణి పనులు కొనసాగుతున్నాయి.

Also Read: కాల్వ మెడకు ఎన్నికల కమిషన్ ఉచ్చు

మెట్లు, ఇతర నిర్మాణాల పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రెసిడెన్షియల్ కాటేజీ సహా వీఐపీ కాటేజీల నిర్మాణం కూడా దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. 15 కాటేజీలలో ఒకటి మినహా అన్ని పనులు పూర్తయ్యాయి. కళ్యాణకట్ట కొద్దిరోజుల్లో సిద్ధం అవుతుందని అధికారులు చెబుతున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒకే దగ్గర రెండు వేల వాహనాలకు పార్కింగ్ సౌలభ్యం కల్పించామని అధికారులు తెలిపారు. ఇది కూడా మరో 15 రోజుల్లో పూర్తవుతుందని యాదాద్రి డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు యాదాద్రిని సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించారు. 90 శాతం పనులు పూర్తవడంతో త్వరలోనే ఆలయ ప్రారంభంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. దీనికి సంబంధించి చిన్నజీయర్ స్వామితో సీఎం కేసీఆర్ చర్చలు జరపనున్నారని తెలుస్తోంది.

వాస్తవానికి ఈ సమయంలో కేసీఆర్‌‌ పనుల పరిశీలనకు కాకుండా.. ప్రారంభోత్సవానికి రావాల్సి ఉంది. ఇందుకోసం గతంలో ముహూర్తం సైతం ఫిక్స్ చేశారు. కానీ.. పనులు మాత్రం అనుకున్నట్లుగా సాగలేదు. గతేడాది చినజీయర్ స్వామిని కలిసినప్పుడు.. ఫిబ్రవరి నెలలో సుదర్శన యాగం, చండీయాగంతోపాటు రాజశ్యామల యాగం చేయాలని.. అప్పటికల్లా యాదాద్రి పనులు పూర్తి చేయాలని ప్రణాళికను స్వామి ముందు పెట్టినట్లుగా ప్రచారం జరిగింది. కానీ.. ఇప్పుడు మే నెలకు వెళ్లింది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Back to top button