తెలంగాణరాజకీయాలు

కిరాతక చెడ్డీ గ్యాంగ్ వస్తోంది.. జాగ్రత్త

ఆ మ‌ధ్య హైద‌రాబాద్ లో తీవ్ర అల‌జ‌డి సృష్టించిన చెడ్డీ గ్యాంగ్ మ‌ళ్లీ న‌గ‌రంలోకి దిగిందా? అంటే అవును అనే అంటున్నారు పోలీసులు. అత్యంత చాకచాక్యం చోరీలు చేయ‌డం.. ప‌ట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తే ఎంత‌టి దారుణానికైనా ఒడిగ‌ట్టే ఈ దొంగ‌లు మ‌ళ్లీ క‌ల‌క‌లం సృష్టిస్తున్నారు. దాదాపు ఐదారు నెల‌లు దూరంగా ఉంటూ.. తిరిగి చోరీల‌కు పాల్ప‌డుతూ పోలీసులకు స‌వాల్ విసురుస్తున్నారు. వీళ్లు దొంగ‌త‌నాలు చేసిన విష‌యం సీసీ ఫుటేజీలు చూస్తేనేగానీ గుర్తుప‌ట్ట‌డం కూడా సాధ్యం కాదంటే.. చోర‌క‌ళ‌లో ఎంత‌టి చేతివాటం క‌లిగి ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

దండుపాళ్యం సినిమాలోని బ్యాచ్ త‌ర‌హాలో వీళ్లు నేరాల‌కు పాల్ప‌డుతుంటారు. ప‌గ‌టి పూట ఈ బ్యాచ్ కు చెందిన మ‌హిళ‌లు రెక్కీ నిర్వ‌హిస్తారు. ఇందుకోసం దుప్ప‌ట్లు, బొమ్మ‌లు, ఇత‌ర‌త్రా వ‌స్తువులు అమ్ముతున్న‌ట్టుగా తిరుగుతారు. ఈ క్ర‌మంలోనే ఏ ఇళ్లు ఖ‌రీదైన‌ది.. ఏ ఇంట్లో చోరీ చేస్తే గిట్టుబాటు అవుతుంద‌నే అంచ‌నాలు వేసుకుంటారు. ఆ త‌ర్వాత వెళ్లి.. తాము సేక‌రించిన స‌మాచారాన్ని పురుషుల‌కు చెబుతారు.

అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత ఈ చెడ్డీ గ్యాంగ్ రంగంలోకి దిగుతుంది. వీళ్లు కేవ‌లం చెడ్డీలు, బ‌నియ‌న్ల మీద‌నే చోరీల‌కు సిద్ధ‌మ‌వుతారు. ఒక‌వేళ ఎవ‌రైనా ప‌ట్టుకుంటే జారిపోయేందుకు వీలుగా ఒంటికి నూనె కూడా రాసుకుంటారు. అడుగుల శ‌బ్దం రాకుండా చెప్పులు తీసేస్తారు. అనంత‌రం టార్గెట్ చేసిన ఇంటికి వెళ్లి ప‌నిలో ప‌డ‌తారు. ఎంత పెద్ద తాళాన్నైనా సౌండ్‌ రాకుండా ప‌గ‌ల‌గొట్ట‌డం వీరి ప్ర‌త్యేక‌త‌. ఇండిపెడెంట్ ఇళ్ల‌నే ఎక్కువ‌గా టార్గెట్ చేసే ఈ చెడ్డీ బ్యాచ్‌.. మిస్స‌వ‌కుండా ప‌ని పూర్తిచేసుకుని వెళ్తారు.

హైద‌రాబాద్ లో ఈ గ్యాంగ్ దిగింద‌నే అనుమానం నేప‌థ్యంలో పోలీసులు అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఇంటి చుట్టుప‌క్క‌ల చెట్ల పొద‌లు లేకుండా చూసుకోవాల‌ని చెబుతున్నారు. అవ‌కాశం ఉన్న‌వారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల‌ని సూచిస్తున్నారు. ఇంటి గేటుదాటి ఎవ‌రైనా రాగానే అలారం మోగేలా ఏర్పాట్లు చేసుకోవాల‌ని, విలువైన వ‌స్తువులు ఇళ్ల‌లో కాకుండా బ్యాంకుల్లో దాచుకోవాల‌ని పోలీసులు సూచిస్తున్నారు. ప‌గ‌టిపూట‌ ఎవ‌రైనా అనుమానాస్ప‌దంగా సంచ‌రిస్తున్న క‌నిపిస్తే.. పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వాల‌ని సూచిస్తున్నారు. త‌ద్వారా.. చోరీల‌ను ముందుగానే అడ్డుకునేందుకు స‌హ‌క‌రించాల‌ని కోరుతున్నారు.

Back to top button