బాలీవుడ్సినిమా

ప్రభాస్‌ మూవీ @ 600 కోట్లు

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు భారీ బడ్జెట్‌ సినిమాలకు ప్రభాస్‌ కేరాఫ్‌లా మారిపోయారు. తన రేంజ్‌ రోజురోజుకూ ఎక్కవవుతోందే తప్ప తగ్గింది లేదు. ఆ మధ్య తీసిన ‘బాహుబలి’, ‘బాహుబలి‌‌–2’ భారీ బడ్జెట్‌తో తెరకెక్కినవే. ఆ తర్వాత తీసిన ‘సాహో’ కూడా లోబడ్జెట్‌ నిర్మిద్దామనుకున్నా అది కాస్త 100 కోట్ల నుంచి రూ.300 కోట్లు దాటిపోయింది. బాహుబలి అనుకున్న దానికన్నా ఎక్కువే కలెక్షన్ల వర్షం కురిపించింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన మరో చిత్రం ‘సాహో’ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

దీంతో ప్రభాస్‌ కొత్త చిత్రం ‘రాధేశ్యామ్‌’కు కొంచెం బడ్జెట్‌ నియంత్రణ పాటిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ.. ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమాలకు మాత్రం అలాంటి పరిమితులేమీ లేవట. ఇటీవల ప్రభాస్ రెండు కొత్త సినిమాల బడ్జెట్ల గురించి వినిపిస్తున్న కబుర్లు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి.

బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నాడు. అదే ‘ఆదిపురుష్’. ఈ సినిమా బడ్జెట్ రూ.500 కోట్లని బాలీవుడ్ మీడియా రిపోర్ట్ చేసింది. అదే నిజమైతే ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా ‘ఆదిపురుష్’ రికార్డులకెక్కడం ఖాయం. అయితే ఈ రికార్డును మళ్లీ ప్రభాసే బద్దలు కొట్టబోతున్నాడని నిర్మాత అశ్వినీదత్ మాటల్ని బట్టి స్పష్టమవుతోంది. దత్ నిర్మాణంలో ఆయన అల్లుడు నాగ్ అశ్విన్  దర్శకత్వంలో ప్రభాస్ ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక వీడియో ఇంటర్వ్యూలో దత్ మాట్లాడుతూ.. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా రూ.600 కోట్లని అన్నారు. ఈ విషయాన్ని నిర్మాతే స్వయంగా చెప్పాడు.

ఒక భారతీయ సినిమా మీద ఈ స్థాయి బడ్జెట్ పెట్టడం అన్నది అనూహ్యమైన విషయమే. అంతగా ఖర్చు చేసి ఎలాంటి సినిమా తీస్తారన్నది ఉత్కంఠ రేకెత్తించే విషయం. కాగా.. అశ్విన్ సినిమా కంటే ముందు ప్రభాస్ ‘ఆదిపురుష్’ చేస్తాడని దత్ క్లారిటీ ఇచ్చారు. ఆ చిత్రం జనవరిలో మొదలై ఆరు నెలల్లో పూర్తవుతుందని.. ఆ తర్వాత నాగ్ అశ్విన్ సినిమా చేయడానికి ప్రభాస్‌కు ఏడాదికి పైగా సమయం పడుతుందని ఆయన వెల్లడించారు. చూడాలి మరి.. అదే స్థాయి బడ్జెట్‌తో నిర్మితమైతే మాత్రం ప్రభాస్‌ మరో రికార్డు సృష్టించబోతున్నట్లే.

Back to top button