తెలంగాణరాజకీయాలు

పుట్ట మధు అరెస్ట్

Putta Madhuపెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధును పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఏ కేసులో అరెస్ట్ చేశారో మాత్రం చెప్పలేదు. దీంతో ఆయన అరెస్ట్ పై విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. వారం రోజులుగా అదృశ్యమైన మధుపై పలు ఆరోపణలు ఉన్నాయి. భూకబ్జా, హత్యలతో పాటు పలు నేరాల్లో ఆయన ప్రమేయం ఉన్నట్లు పోలీసులకు తెలిసినట్లు తెలుస్తోంది. అందుకే ఆయన్ను అరెస్ట్ చేసినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఈటల రాజేందర్ తో..
మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు అత్యంత సన్నిహితుడిగా, అనుచరుడిగా మధు వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయనపై సీఎం కేసీఆర్ ఓ కన్నేసి ఉంచారనే ప్రచారం జరుగుతోంది. అందుకే మధును పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసింది. ఇప్పటికే ఈటల రాజేందర్ పై భూకబ్జా కేసులో ప్రమేయం ఉన్నట్లు తేలడంతో పార్టీ నుంచి బహిష్కరించగా పుట్ట మధు అరెస్ట్ ప్రాధాన్యతను సంతరించుకుంది.

కోవిడ్ లక్షణాలతోనే..
తన భర్తకు కోవిడ్ లక్షణాలు ఉండడంతో విశ్రాంతి తీసుకుంటున్నారని భార్య పుట్ట శైలజ చెప్పారు. ప్రజాప్రతినిధులకు వ్యక్తిగత జీవితం ఉండదా అని ప్రశ్నించారు. అనవసర రాద్దాంతాలు చేయకుండా మౌనంగా ఉండాలని సూచించారు. త్వరలోనే ప్రజలతో మమేకం అవుతారని అంతవరకు ఓపిక పట్టాలని కార్యకర్తలకు సూచించారు.

టీఆర్ఎస్ ను వీడేది లేదు
రాజకీయంగా ఎదుగుదలకు కారణమైన టీఆర్ఎస్ పార్టీని వీడేది లేదని పుట్ట శైలజ చెప్పారు. తమ రాజకీయ ప్రస్థానానికి కేంద్ర బిందువైన సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామని స్పష్టం చేశారు. తల్లి లాంటి పార్టీని వీడుతున్నారని వస్తున్న పుకార్లలో నిజం లేదని తేల్చి చెప్పారు. దీంతో ఇన్ని రోజుల సస్పెన్స్ కు తెరపడింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంతోనే ఇన్ని రకాల ఆరోపణలు వచ్చినట్లు భావిస్తున్నామన్నారు.

ఏ కేసులో..
అసలు ఏ కేసులో అరెస్ట్ చేశారో స్పష్టం చేయలేదు. అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్య, భూ కబ్జా వ్యవహారంలోనా అనేది తేలాల్సి ఉంది. ఇప్పటికీ పోలీసులు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. దీంతో పుట్ట మధు అరెస్ట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. భవిష్యత్తులో ఎలాంటి చర్యలకు దారి తీస్తోందో వేచి చూడాలి.

Back to top button