ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

జగన్ ను ఎంపీ కొత్త వివాదంలోకి లాగారా?


ముందుగా ప్రకటించిన విధంగానే నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైసీపీ అధినేత సీఎం జగన్ కు లేఖ రాశారు. ఈ లేఖలో ప్రభుత్వంపై మతపరమైన బురద జల్లెందుకు ప్రయత్నం చేశారు. వైసీపీ ప్రభుత్వం క్రిస్టియానిటీని, మత మార్పిడులు ప్రోత్సహిస్తుందని బీజేపీ, హిందుత్వ సంస్థలు విమర్శించినట్లుగా…రఘురామ కృష్ణంరాజు అదేవిధంగా క్రిస్టియానిటీని ప్రోత్సహిస్తుందని అర్ధం వచ్చేలా లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖతో వైసీపీ ప్రభుత్వాన్ని కొత్త వివాదంలోకి లాగే ప్రయత్నం చేశారు.

తనకు విజయ సాయిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీస్ ఇచ్చారని, అయితే ఎన్నికల సంఘం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును వాడవద్దని గతంలో అనేక మార్లు సూచించిన విషయాన్ని లేఖలో స్పష్టం చేశారు. యువజన శ్రామిక రైతు పార్టీలో క్రమశిక్షణా సంఘం ఉందా?..లేదా? అనే విషయాన్ని ప్రశ్నిస్తూ… గతంలో లేవనెత్తిన అంశాలనే మళ్ళీ ప్రస్తావించారు.

పార్టీల చేతుల్లో కీలుబొమ్మలు.. కాపు నేతలు మేల్కొనేదెప్పుడు?

ఇక ఇంగ్లీష్ మీడియం విషయంలో లోక్ సభలో తాను చేసిన ప్రసంగం విషయంలో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదని, టిటిడి ఆస్తుల అమ్మకం విషయంలోనూ స్వతహాగా స్వామివారి భక్తుడనైన తాను… భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా నిర్ణయం తీసుకోవద్దని చెప్పానని, దీనికి సీఎం కోటరీలోని వ్యక్తులు తనపై క్రిస్టియన్ వ్యతిరేకి అనే ముద్ర వేశారని పేర్కొన్నారు. అదేవిధంగా పార్టీ అనుకూల మీడియా సంస్థలు తనపై అసత్య కథనాలు రాశాయని వివరించారు.

ఇసుక విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను, ఇళ్ల స్థలాలకు భూముల కొనుగోలు విషయంలో కొన్ని అంశాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు ఈ అంశాలపై స్పందించి మాట్లాడటం జరిగిందన్నారు. గతంలో తాను ఇచ్చిన విందుకు బీజేపీ నేతల్ని మాత్రమే ఆహ్వానించలేదన్నారు. చైనా సరిహద్దులో ఉద్రిక్తత నేపథ్యంలో ఒక పాట రిలీజ్ చేసిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.

సచివాలయం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

నరసాపురం ఎంపీగా తాను సాధించిన విజయంలో 90 శాతం క్రెడిట్ పార్టీ అధినేత జగన్ కే దక్కుతుందని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో తన దిష్టిబొమ్మలను దహనం చేయడం, ఫోన్ లో బెదిరింపులకు పాల్పడటంతో కేంద్ర బలగాల భద్రత కోరినట్లు పేర్కొన్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి తాను నమ్మకమైన సైనికుడినని చెప్పుకున్నారు.

లేఖపై వైసీపీ నేతలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అంశాలను జగన్ దృష్టికి తేవాలనే అభిప్రాయం ఉంటే ముందే సీఎం జగన్ కు లేఖ రాయకుండా ఎన్నికల సంఘంకు ఎందుకు ఫిర్యాదు చేశారనేది వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. మీడియా తో మాట్లాడిన విధానానికి, లేఖలో సమాధానం ఇచ్చిన విధానానికి సంబంధం లేదని పార్టీ వర్గాల వాదన.. ఈ లేఖపై సీఎం జగన్ స్పందన ఏ విధంగా ఉంటుందనే విషయం తెలియాలంటే వేచి చూడాల్సిందే.