తెలంగాణరాజకీయాలు

కేసీఆర్, హరీష్ లకు ఈటల సంచలన సవాల్

హుజూరాబాద్ నియోజకవర్గం వేదికగా మాజీ మంత్రి, బీజేపీ నేతల ఈటల రాజేందర్ మరో సంచలన సవాల్ విసిరారు.. దమ్ముంటే హుజూరాబాద్ లో నా మీద పోటీచేసి గెలవాలని సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులకు సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం చెల్పూర్ లో పెద్ద ఎత్తున ముదిరాజ్ కులస్తులు మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.. హుజురాబాద్, జమ్మికుంట మండలాలకు చెందిన యూత్ నాయకులు కూడా బీజేపీలో చేరారు. వీరి సమక్షంలో ఈటల మాట్లాడారు.

మాజీ మంత్రి ఈటల హాట్ కామెంట్స్ చేశారు. ఉరుములు వచ్చినా, పిడుగులు పడ్డా నా గెలుపును ఆపలేరన్నారు. ‘వస్తవా.. రా..! హరీశ్ ఇక్కడ పోటీ చేద్దాం. వస్తవా.. రా.. కేసీఆర్.. నా మీద పోటీ చేయ్..’ దమ్ముంటే గెలవండని సవాల్ చేశారు. బక్క పల్చటి పిలగాడు, దిక్కులేని పిలగాడని నన్ను అనుకుంటున్నావ్? నేను దిక్కులేని వాన్ని కాదు.. హుజురాబాద్ ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డను నేను. పదేసి లక్షలు దళిత బంద్ ఇచ్చినా, గొర్రెలిచ్చినా, కులాలవారిగా తాయిలాలిచ్చినా.. నేనే వాళ్ల గుండెళ్లో ఉన్నా..
రేపు ఎన్నికల్లో చూసుకుందాం… ప్రజల ఓట్లతో వచ్చిన మీ పదవులతో వాళ్లకు ద్రోహం చేస్తే కర్రు కాల్చి వాతపెడతారు. ’’ అని ఈటల నిప్పులు చెరిగారు.

ఈటల రాజేందర్ ను ఓడించేందుకు ఐదు వేల కోట్లైనా ఖర్చు చేస్తారట. గతంలో ఏనాడు ఈ నియోజవర్గంలో కనిపించని మంత్రులు ఇప్పుడు ఎందుకు వస్తున్నట్లు
వాళ్ల ప్రేమంతా మీ ఓట్లపైనే. నన్ను కాపాడుకుంటరా.. చంపుకుంటరా మీ ఇష్టం. అంటూ ఈటల మండిపడ్డారు. ఎక్కడ దు:ఖం ఉన్నా, ఆపద ఉన్నా అక్కడుండే బిడ్డను నేను..
దళితుల ఓట్ల మీద తప్ప.. హుజురాబాద్ దళితులపై కేసీఆర్ పై ప్రేమ లేదని ఈటల విమర్శించారు.

హైదరాబాద్ ఎన్నికల సమయంలో వరదలొస్తే ఇంటికి పది వేలు ఇస్తానన్న కేసీఆర్.. ఓట్లయ్యాక.. ఆ హామీ నెరవేర్చలేదని విమర్శించారు. ఒడ్డెక్కదాకా ఓడమల్లన్న.. ఒడ్డెక్కినాక బోడమల్లన్న రకం కేసీఆర్ అని మండిపడ్డారు. దమ్ముంటే ప్రలోభాలు బంద్ చేసి, పోలీసులను వెనక్కి రప్పించుకుని నిజాయతీగా ఎన్నికల్లోకి రావాలన్నారు. ధాన్యం కొనకపోతే రైతుల బతుకులు ఆగమైతవని, ఆసరా ఫించన్లు, రేషన్ కార్డులు ఇవ్వాలని కోరినందుకే నామీద కేసీఆర్ కోపం పెంచుకున్నారని ఈటల అన్నారు.

కమ్యూనిటీ హాళ్లకు, దేవాలయాలకు నిధులిస్తే తప్పులేదు. ఆ సొమ్మంతా మీదే తీసుకోండని ఈటల ప్రజలను కోరారు. తెల్లబట్టలో పసుపు, బియ్యం పెట్టి ప్రమాణం చేయిస్తారు… అక్కడ మాత్రం జాగ్రత్తగా ఉండండని ఈటల అన్నారు. ఏమిచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం పువ్వు గుర్తుకు వేయండని ఈటల అన్నారు.నేను పనిచేస్తేనే ఇక్కడి ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు గెలిచారని వాళ్లు పార్టీ మారినా ఆత్మవంచన చేసుకోవద్దని కోరారు.

Back to top button