అప్పటి ముచ్చట్లుటాలీవుడ్సినిమా

జయప్రద అర్ధరాత్రి వెళ్తుందని తిట్టేసిన నిర్మాత !

Jayaprada
ముప్పై నలభై ఏళ్ల క్రితం సినిమా అంటే విపరీతమైన క్రేజ్ ఉండేది. అందులో అందాల హీరోయిన్ అంటే.. ఇక తెలుగు తెర పై తళుక్కున మెరిసిన తారలా ఆమెను ఆరాధించేవారు. అందుకే షూటింగ్‌ సమయంలో అప్పటి స్టార్ హీరోయిన్లకు కొన్ని ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేసేవారు అప్పటి నిర్మాతలు. పైగా స్టార్‌ కథానాయిక అయితే ఇక చెప్పేది ఏముంది ? ఆమె కోరుకున్న ప్రతిదీ ఆమె ముందు వాలేది.

అయితే ఒక స్టార్ హీరోయిన్ జాబితా చూసిన అప్పటి ఒక బడా నిర్మాత తెగ ఫైర్ అయిపోయాడట. తినే ఆహారం నుంచి నిద్రపోయే మంచం వరకూ అన్నీ నాణ్యమైన వాటినే సమకూరుస్తున్నాం కదా ? మళ్ళీ ఈ అదనపు ఆర్భాటాలు ఏమిటి ? అని ఆ నిర్మాత ఆ హీరోయిన్ని డైరెక్ట్ గానే తిట్టేశాడట. ఆ నిర్మాతే డా. రామానాయుడు, ఆ హీరోయినే అందాల తార జయప్రద. అప్పట్లో జయప్రద సెట్ కి వచ్చింది అంటే.. నిర్మాతకు అదనపు భారం తప్పేది కాదని ప్రచారం కూడా ఉండేది.

ఈ క్రమంలోనే జయప్రద, రామానాయుడు నిర్మిస్తోన్న ఒక తెలుగు చిత్రంలో నటిస్తున్నప్పుడు అవుట్‌డోర్‌ షూటింగ్‌కి రాజమండ్రి దగ్గరలోని గ్రామానికి వెళ్లారు. పక్కనే గోదావరి. షూటింగ్ అయిపోయిన తరువాత జయప్రద తన స్నేహితులతో కలిసి సరదాగా గోదావరి వైపు షికారుకి వెళ్లేవారట. అయితే వరదల కారణంగా ఆ సమయంలో గోదావరి పూర్తిగా పాడు అయిపోయింది. నీరు బురదగా మారి పోవడటంతో ఆ చుట్టూ పక్కల వాసన కూడా వచ్చేదట.

దాంతో జయప్రద, నిర్మాత కారులో తన స్నేహితులతో కలిసి అర్ధరాత్రి వైజాగ్ బీచ్ కి వెళ్లి వచ్చేవారట. అలా రెండు రోజులకు ఒకసారి వెళ్లి వస్తుండటంతో అదనపు ఖర్చు, దానికితోడు షూటింగ్ కి ఆలస్యంగా రావడం, మొత్తానికి రామానాయుడికి ఈ విషయాలు బాగా చికాకు తెప్పించాయి. దాంతో జయప్రద రూమ్ కి వెళ్లి ఆయన ఎడాపెడా తిట్టేశాడట. అయినా జయప్రద అవేమి మనసులో పెట్టుకోకుండా రామానాయుడు ఎప్పుడు కనిపించినా నవ్వుతూ పలకరించేవారట.

Back to top button