జాతీయంరాజకీయాలు

గుడ్ న్యూస్.. ఈఎంఐలు చెల్లించకర్లేదు

దేశంలో కరోనా మహమ్మరిని అరికట్టేందుకు కేంద్రం లాక్డౌన్ చేసిన సంగతి తెల్సిందే. 21రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేయడంతోపాటు పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూ 1.70 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ‘గరీబ్ కల్యాణ్’ పేరుతో దేశంలో ఆకలి చావులు లేకుండా కేంద్రం అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. పలు కీలక నిర్ణయాలను ఆమె ప్రకటించిన సంగతి తెల్సిందే.

తాజాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. దేశంలోని నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో రుణాలు చెల్లించాల్సిన ప్రజలకు ఆర్బీఐ తీపి కబురు చెప్పింది. ఈఎంఐలపై మూడు నెలల మారటోరియం విధిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. రుణాలు తీసుకున్న వారంతా మూడు నెలలు ఈఎంఐలు కట్టకుండా వెసులుబాటు కల్పించినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారికి ఊరట లభించింది.

ఆర్బీఐ ప్రకటించిన ఈ నిర్ణయం క్రెడిట్ కార్డులకి కూడా ఈ మారటోరియం వర్తించనుందా లేనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే బ్యాంకు సేవలపై ఆర్బీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా నేపథ్యంలో బ్యాంకుల్లో కనీస నిల్వ పరిమితిని ఎత్తేసింది. అలాగే ఎటీఎం విత్ డ్రా పరిమితిని కూడా సడలించింది. బ్యాంకు సమయాల్లో మార్పులు చేసింది. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు ఉదయం 10నుంచి మధ్యాహ్నం 2గంటలు పని చేసేలా వెసులుబాటు కల్పింది. ఏదిఏమైనా ఆర్బీఐ ఈఐఎంలపై మూడునెలలపాటు మారిటోరియం విధించడంతో రుణాలు తీసుకున్న వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.