ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

జగన్ ఆ భేటీ నిర్వహించింది అందుకేనా?


ఢిల్లీ పర్యటన రద్దవడంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం గురువారం జరగాల్సిన కీలక భేటీని ముందుగా నిర్వహించారు. అందులో భాగంగా పలు ముఖ్యమైన అంశాలపై పార్టీ ముఖ్య నాయకులు, మంత్రులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఢిల్లీపర్యటన రద్దవడంతో వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయ సాయిరెడ్డి, మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, కొడాలి నాని తదితరులతో ఈ భేటీ నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, కోర్టు తీర్పులతో పాటు ఎన్నికల కమిషనర్, ఢిల్లీ టూర్ రద్దు అయిన వ్యవహారం, ఇతర పలు అంశాలపై కీలక చర్చ జరిగాయి.

హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు వస్తున్న నేపథ్యంలో పరిస్థితిపై సమీక్షించారు. ఎస్.ఈ.సి విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుపై స్టే ఇస్తే కొత్త ఎస్.ఈ.సిని నియమించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఎవరిని నియమించాలనే అంశంపై చర్చించారు.
రాష్ట్రంలో విద్యుత్ చార్జీల విషయంలో విపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారం, తదితర అంశాలపై చర్చించారు. ఇప్పటికే విద్యుత్ సరఫరా సంస్థలు వివరాలు తెలియజేస్తూ వీడియోలు, కరపత్రాలు విడుదల చేశాయని మంత్రి బాలినేని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.

లాక్ డౌన్ సందర్భంగా ఆర్ధికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రంపై ఏ విధంగా వత్తిడి తేవాలనే అంశంపై ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 4వ తేదీన కృష్ణా యాజమాన్య బోర్డు సమావేశం జరగనున్న నేపథ్యంలో బోర్డు దృష్టికి తీసుకువెళ్ళాల్సిన అంశాలు ప్రస్తావనకు వచ్చాయని సమాచారం.

కొద్దీ రోజుల కిందట టిడిపి ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతారని వార్తలు వచ్చినా, చేరలేదు. ఎందుకు సీఎం అంగీకారం తెలపలేదని వార్తలు వచ్చాయి. చేరికాలకు బాలినేని సారధ్యం వహిస్తున్న నేపథ్యంలో బాలినేని ఈ అంశంపై సీఎం దృష్టికి తీసుకువెళ్లి చర్చించారు. వైసీపీలోకి వచ్చే ఎమ్మెల్యేలు ఎవరైనా రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో గెలిచి రావాలని జగన్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత చేరికలపై నిర్ణయం తీసుకోవాలని భావించినా, అనుకోకుండా రద్దు కావడంతో ఆయా అంశాలపై ముందుగానే చర్చించారు. దీంతో త్వరలో చేరికలపై స్పష్టమైన ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.