తెలంగాణప్రత్యేకంరాజకీయాలు

రెడ్డిలే ఇష్యూ.. షర్మిలకు కాంగ్రెస్ చెక్

YS Sharmila
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా గుర్తింపు ఉన్న కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా తయారవుతోంది. ఇప్పటికే చాలా మంది లీడర్లు వలస బాటలో వెళ్లారు. చాలా వరకు పార్టీ ఖాళీ అయింది. అటు టీఆర్‌‌ఎస్‌ లేదంటే బీజేపీలో చేరిపోయారు. దీనికితోడు పార్టీలో సీనియర్ల మధ్య కుమ్ములాటలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకమవుతోంది. ఇక ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి మరో టెన్షన్‌ పట్టుకుంది.

తెలంగాణ రాజన్న రాజ్యం స్థాపిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చారు వైఎస్‌ షర్మిల. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఆమె వైఎస్సార్‌‌ అభిమానులను టార్గెట్‌ చేసి పార్టీని స్థాపించబోతున్నారు. ముఖ్యంగా వైఎస్సార్‌‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నేత. దీంతో ఆయన అభిమానులు కాంగ్రెస్‌ పార్టీలోనూ చాలా మందే ఉన్నారు. ఇక ఇప్పుడు షర్మిల పార్టీ ప్రకటించబోతున్న క్రమంలో కాంగ్రెస్‌కు మరిన్ని గడ్డు పరిస్థితులు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే దీనిపై కాంగ్రెస్‌ పార్టీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నేతలు హైకమాండ్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌లో, తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని ఎదగనివ్వకుండా అక్కడ జగన్‌.. ఇక్కడ షర్మిల అడ్డుపడుతున్నారని పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్‌ ముందస్తు చర్యలకు దిగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్‌కు ఆది నుంచి రెడ్డి సామాజిక ఓటుబ్యాంకు ఎక్కువ. ఆ రెడ్డి సామాజికవర్గంతోపాటే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్లు కూడా. వీటన్నింటినీ ఏపీలో జగన్‌ తీసుకెళ్లిపోయారు.

ఇక తెలంగాణకు వచ్చేసరికి మైనార్టీ ఓట్లు కంప్లీట్‌గా టీఆర్‌‌ఎస్‌కు గంపగుత్తే. ఎస్సీ, ఎస్టీలు అంతో ఇంతో కాంగ్రెస్‌ వైపే ఉన్నారు. ఇక రెడ్డి సామాజిక వర్గం కూడా ఇప్పటివరకు కాంగ్రెస్‌తోనే ఉంది. ఇక ఇప్పుడు షర్మిల పార్టీ పెట్టబోతుండడంతో ఎస్సీ, ఎస్టీ, రెడ్డి సామాజిక వర్గం ఓట్లకు గండిపడే ప్రమాదం ఉందని కాంగ్రెస్‌ ఆందోళన చెందుతోంది. అందుకే.. ముందుగా రెడ్డి సామాజిక వర్గాన్ని చేరదీసి వారితోనే కౌంటర్‌‌ ఇప్పించాలని పార్టీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. బలమైన రెడ్డి సామాజిక వర్గ నేతలు ఎవరూ షర్మిల పార్టీ వైపు మళ్లకుండా జాగ్రత్త పడుతోంది. నాగార్జున సాగర్‌‌ ఉప ఎన్నిక తర్వాత పూర్తిస్థాయి కార్యాచరణ ప్రారంభించబోతున్నట్లు సమాచారం.

Back to top button