ఆంధ్రప్రదేశ్ప్రత్యేకంరాజకీయాలు

సాగర్, తిరుపతి పోలింగ్: ఓటర్ల చేతిలో భవితవ్యం

Sagar, Tirupati Polling: Fate in the hands of voters

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ సందడి మొదలైంది. తిరుపతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం నుంచి ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్ లోనూ ఐదో విడత పోలింగ్ జరుగుతోంది.

మొన్నటి వరకు ప్రచారంతో హోరెత్తించిన అభ్యర్థులు నిన్న ఓటర్లకు మందు, విందు, డబ్బులు భారీగా పంచినట్టు ప్రచారం సాగుతోంది. ఓటు నోటులు పంచి తమ అభ్యర్థులను గెలిపించాలని పార్టీలన్నీ తమ చివరి ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.

ఏపీలో తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్.. తెలంగాణలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఉప ఎన్నికలు వచ్చాయి. తిరుపతిలో వైసీపీ నుంచి గురుమూర్తి, టీడీపీ నుంచి పనబాక లక్ష్మీ, బీజేపీ-జనసేన నుంచి రత్నప్రభ బరిలోకి దిగారు.

ఇక తెలంగాణలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, బీజేపీ నుంచి డాక్టర్ రవికుమార్ బరిలో నిలిచారు.

తిరుపతి పార్లమెంట్ పరిధిలో మొత్తం 17 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ ఏడింటిలో మూడు చిత్తూరు జిల్లాలో.. నాలుగు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. అన్నింట్లోనూ వైసీపీ ఎమ్మెల్యేలే గెలిచారు. దీంతో తిరుపతి పార్లమెంట్ లో వైసీపీ పార్టీకి కాస్త మొగ్గు కనిపిస్తోంది.తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో మొత్తం 28మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మొత్తం 2,20,300 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,09,228 మంది, మహిళా ఓటర్లు 1,11,072 మంది ఉన్నారు. సాగర్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 41మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

తిరుపతి, నాగార్జున సాగర్ లో ప్రచారం హోరాహోరీగా సాగింది. ప్రచారం ముగిసి నేడు పోలింగ్ జరుగుతుండడంతో పోలింగ్ సరళిని పార్టీలు పరిశీలిస్తున్నాయి. ఓటర్ల చేతిలో అభ్యర్థుల భవితవ్యం ఉంది.

Back to top button