ఆరోగ్యం/జీవనం

రాత్రిళ్లు ఫోన్ ఎక్కువగా చూస్తున్నారా.. ఆ సమస్యలు వచ్చే ఛాన్స్..?

దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం అంతకంతకూ పెరుగుతోంది. కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల అమలు తర్వాత సెల్ ఫోన్ వినియోగం మరింత పెరిగింది. రాత్రి సమయంలో కూడా చాలామంది మొబైల్ ఫోన్ ను వినియోగిస్తున్నారు. అయితే రాత్రివేళలో మొబైల్ చూడటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. రాత్రి సమయంలో ఫోన్ వాడితే ఫోన్ స్క్రీన్ లైటింగ్ కళ్లపై పడుతుంది.

స్మార్ట్ ఫోన్ రాత్రి సమయంలో ఎంతోమందిని నిద్రకు దూరం చేస్తోంది. ప్రముఖ కంపెనీలలో ఒకటైన వేక్ ఫిట్.కో హైదరాబాద్ వాసుల నిద్రాలవాట్ల గురించి అధ్యయనం చేసి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. హైదరాబాదీలలో 94 శాతం మంది పడుకునే ముందు మొబైల్ ఫోన్ ను వినియోగిస్తున్నారని ఈ సంస్థ వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే మూడు శాతం ఎక్కువమంది రాత్రిళ్లు మొబైల్ ఫోన్ ను వినియోగించారు.

వీరిలో 26 శాతం మంది రాత్రిళ్లు సినిమాలు చూస్తున్నామని చెబితే 16 శాతం మంది ల్యాప్ టాప్, సెల్ ఫోన్ సహాయంతో రాత్రిళ్లు పని చేసినట్లు చెప్పారు. రాత్రిళ్లు ఫోన్ ఎక్కువగా చూసే వారిలో 40 శాతం మంది వెన్నునొప్పి సమస్యతో బాధ పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే మెరుగైన పరుపులు వాడటం, ల్యాప్ టాప్ స్మార్ట్ ఫోన్ వాడకపోవటం, క్రమబద్ధమైన నిద్ర అలవాట్లను అలవరచుకోవడం వల్ల నిద్ర నాణ్యత మెరుగవుతుందని 28 శాతం మంది భావిస్తున్నారు.

క్రమ పద్ధతిలో నిద్ర అలవాట్లు లేకపోతే దీర్ఘకాలిక రుగ్మతల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్య నిపుణులు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం. రాత్రిపూట మొబైల్ ను ఎక్కువగా వినియోగిస్తే పురుషులలో సంతానోత్పత్తి నాణ్యత తగ్గుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Back to top button