తెలంగాణరాజకీయాలుసంపాదకీయం

తెలంగాణ‌లో ష‌ర్మిల దీక్ష.. ఏం జ‌ర‌గ‌బోతోంది?


తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మం వెనుక ఎన్నో ఆకాంక్ష‌లు ఉన్నాయి. కానీ..ప్ర‌ధాన‌మైన‌వి మాత్రం మూడే. ‘నీళ్లు, నిధులు, నియామకాలు’. మొదటి రెండిటి సంగతి ఎలా ఉన్నా.. మూడోదైన నియామ‌కాల విష‌యంలో యావ‌త్ తెలంగాణ యువ‌త‌రం టీఆర్ఎస్ పై ఆగ్ర‌హంగా ఉంద‌నేది కాద‌న‌లేని స‌త్యం. రాష్ట్ర ఉద్య‌మం సంద‌ర్భంగా.. స్వ‌రాష్ట్రం సిద్ధిస్తే రెండు ల‌క్ష‌ల ఉద్యోగాలు మ‌న‌వే అంటూ ఎన్నోసార్లు చెప్పారు నేత‌లు. కానీ.. రాష్ట్రం ఆవిర్భవించి ఏడు సంవ‌త్స‌రాలు పూర్తి కావొస్తున్నా.. నోటిఫికేష‌న్లు ఏవీ అని ప్ర‌శ్నిస్తోంది యువ‌త‌. సాక్షాత్తూ కాక‌తీయ యూనివ‌ర్సిటీలో ఓ విద్యార్థి.. త‌న చావుకు ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్లు ఇవ్వ‌క‌పోవ‌డ‌మేనంటూ సెల్ఫీ వీడియో తీసుకొనిమ‌రీ పురుగుల మందు తాగి చనిపోవ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతోంది.

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ స‌మ‌స్య‌ నివురుగ‌ప్పిన నిప్పులా ఉంద‌న్న సంగ‌తి విద్యార్థి సునీల్ ఆత్మ‌హ‌త్య‌తో బ‌య‌ట‌ప‌డింది. ఇది రాబోయే రోజుల్లో ఎలాంటి రూపం తీసుకుంటుందో చెప్ప‌లేం. అలాంటి స‌మ‌స్య‌ను ఇప్పుడు ప‌ట్టుకున్నారు వైఎస్ ష‌ర్మిల‌. నిరుద్యోగుల‌కు అండగా ఉంటామ‌ని, క‌ద‌న‌రంగంలోకి దూక‌బోతున్నామ‌ని, కేసీఆర్ దిగొచ్చే వ‌ర‌కు పోరాటం ఆగ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. ఏప్రిల్ 15 నుంచి రిలే నిరాహార దీక్ష చేప‌ట్ట‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారామె. మూడు రోజుల‌పాటు దీక్ష కొన‌సాగుతుంద‌ని, నాలుగ‌వ రోజు నుంచి త‌మ‌ కార్య‌క‌ర్తలు కొన‌సాగిస్తార‌ని ప్ర‌క‌టించారు. నోటిఫికేష‌న్లు ఇచ్చే వ‌ర‌కూ ఈ దీక్ష‌లు ఆగ‌వ‌ని చెప్పారు.

నిజానికి రాష్ట్రంలో యువ‌త‌, నిరుద్యోగుల స‌మ‌స్య‌ల‌పై విప‌క్షంలోని ప్ర‌ధాన పార్టీలు దృష్టిపెట్టిన దాఖ‌లాల్లేవు. కాంగ్రెస్‌, బీజేపీ నేత‌లు త‌మ ప్ర‌సంగాల్లో య‌థాలాపంగా చేసిన విమ‌ర్శ‌లు మిన‌హా.. కార్యాచ‌ర‌ణ‌తో ముందుకు సాగింది లేదు. నిరుద్యోగుల‌, యువ‌త ప‌క్షాన నిర్మాణాత్మ‌క‌మైన పోరాటాలు రూపొందించింది లేదు. ప్ర‌భుత్వాన్ని నిల‌దీసింది లేదు.

తెలంగాణ వ‌స్తే త‌మ ఆకాంక్ష‌లు నెర‌వేరుతాయ‌ని ఎంతో మంది విద్యార్థులు, నిరుద్యోగులు ఆశించారు. ఇది ఎవ్వ‌రూ కాద‌న‌లేని స‌త్యం. అస‌లు, యువ‌త ఉద్య‌మించిందే ఈ కోణంలో! కానీ.. రాష్ట్రం వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌భుత్వం వారి ఆశ‌ల‌ను పూర్తిస్థాయిలో నెర‌వేర్చ‌లేద‌నేది కూడా విస్మ‌రించ‌లేని అంశం. ఇలాంటి స‌మ‌స్య‌ను ష‌ర్మిల ప్ర‌ధానాంశంగా తీసుకున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామం అని చెప్పొచ్చు. ప్ర‌ధానంగా ప్ర‌భుత్వాన్ని క‌దిలించే అంశంగా భావించొచ్చు.

నోటిఫికేష‌న్లు రాలేద‌ని ఒక విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం చూడ్డానికి చిన్న‌గానే క‌నిపించొచ్చు. కానీ.. తెలంగాణ‌ యువ‌తలో అగ్నిప‌ర్వ‌తం ఎప్ప‌టి నుంచో ర‌గులుతూనే ఉంద‌ని, అది ఏ క్ష‌ణ‌మైనా బ‌ద్ద‌లు కావొచ్చ‌నే అభిప్రాయం కూడా కొన్నాళ్లుగా వ్య‌క్త‌మ‌వుతోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లోనే విద్యార్థి చ‌నిపోవ‌డం.. ష‌ర్మిల ఇదే అంశాన్ని ప్ర‌ధాన ఎజెండాగా చేసుకోవ‌డం ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేసే ప‌రిణామ‌మే. ఇలాంటి ప‌రిస్థితుల్లో యువ‌త‌ను చ‌ల్లార్చే ప్ర‌య‌త్నంలో భాగ‌మేనా అన్న‌ది తెలియ‌దుగానీ.. ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్లు రిలీజ్ చేస్తోంది.

మొత్తానికి జాతీయ పార్టీలు కూడా టేక‌ప్ చేయ‌లేని ప్ర‌ధాన‌ అంశాన్ని.. ఇంకా పురుడు పోసుకోని పార్టీ ముందుకు తీసుకెళ్ల‌డం గ‌మ‌నించాల్సిన అంశం. ఈ పోరాటం ఎంత వ‌ర‌కు తీసుకెళ్తార‌నేది తెలియ‌దుగానీ.. ప్ర‌భుత్వంలో క‌ద‌లిక తీసుకొచ్చే ప్ర‌య‌త్న‌మైతే మొద‌లైంది. నిరుద్యోగులు, యువ‌త ఆర్గ‌నైజ్ అయితే.. పోరాటం మ‌రోస్థాయికి వెళ్లినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. మ‌రి, సాగ‌ర్ ఎన్నిక‌ల ముందు మొద‌లైన ష‌ర్మిల ఉద్య‌మం.. ఏ మ‌లుపులు తీసుకుంటుంది? ఎలాంటి ఫ‌లితాల‌ను న‌మోదు చేస్తుంది? అనేది చూడాలి.

Back to top button