ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

దుర్గమ్మ రథంలో వెండి సింహాలు మాయం చేసిందెవరు?

ఆలయాల భద్రతపై అనేక అనుమానాలు..

ఏపీలో అంతర్వేది ఘటన తర్వాత ఆలయాల భద్రతపై ప్రతీఒక్కరికి అనుమానాలు కలుగుతున్నారు. ఆలయాల రక్షణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే ప్రశ్న తలెత్తుతోంది. అంతర్వేదిలో దేవుడి ఊరేగింపుకు వినియోగించే రథాన్ని గుర్తుతెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించిన దుండగులను శిక్షించాలంటూ బీజేపీ, జనసేన, టీడీపీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

Also Read: సోము వీర్రాజు వ్యూహం.. కన్నా పూర్తిగా సైడ్ అయినట్లేనా?

అంతర్వేది ఘటనపై బీజేపీ, జనసేన పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో జగన్ సర్కార్ సీబీఐ విచారణకు ఆదేశించారు. దీంతోపాటు రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ఉన్న రథాల భద్రతపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈనేపథ్యంలోనే విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి ఆలయంలోని దుర్గమ్మ రథంలో అమర్చిన వెండి సింహ ప్రతిమలు కన్పించకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది.

ఆలయాల్లోని రథాల భద్రతను పరిశీలించడంలో భాగంగా పోలీసులు విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించారు. ఈ ఆలయంలోని రథంలో ఉత్సవమూర్తుల విగ్రహాలను ఉంచి ప్రతీ ఉగాదికి ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే కోవిడ్ పరిస్థితుల్లో ఈ రథంపై ఆలయ నిర్వహాకులు ముసుగువేసి ఉంచారు. ఈ రథాన్ని పోలీసులు పరిశీలించగా రథంలో ఉండాల్సిన నాలుగు వెండి సింహ ప్రతిమల్లో మూడు కన్పించకపోవడాన్ని గుర్తించారు. ఈ విషయం ఆ నోటా ఈనోటా అందరికీ తెలియడంతో ఆలయ ఈవో తాజాగా వివరణ ఇచ్చారు.

దుర్గమ్మ రథంలో ఆలయంలోనే గత 18నెలలుగా ఉందని చెప్పారు. ఆలయంలోని వెండి, బంగారు వస్తువులు, వాహనాలకు పూర్తిగా బీమా సౌకర్యం ఉందని తెలిపారు. రథంలో కన్పించకుండా పోయిన వెండి సింహాల ప్రతిమలు మరమ్మతులకు ఇచ్చారా? లేదా లాకర్లలో భద్రత పరిచారా? తెలుసుకున్నాకే పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

Also Read: నూతన్‌ నాయుడి బెయిల్‌ పిటిషన్ రద్దు

కాగా దుర్గమ్మ రథంలోని వెండి సింహాలు చోరికి గురయ్యాయంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. రథానికి సంబంధించిన ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీలోని ఆలయాల్లో వరుసగా ఇలాంటి సంఘటనలు వెలుగుచూస్తుండంపై ఆలయాల భద్రతపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. దీనిపై సీఎం జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే..!

Back to top button