ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

వైసీపీ ప్రభుత్వాన్ని నడుపుతుందా? రౌడీయిజాన్నా?: వీర్రాజు ఫైర్

Somu Veeraraj criticizes the YCP government

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నడుపుతుందా? రౌడీయిజాన్ని నడుపుతుందా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. చిత్తూరు జిల్లా యాదలమర్రిలో నిర్వహించిన బీజేపీ సమావేశంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఈ సమావేశం నిర్వహించకుండా వైసీపీ నేతలు, అధికారులు ప్రయత్నం చేయడాన్ని ఖండించారు. ‘‘సభకు వస్తుంటే మా పార్టీ కార్యకర్తల పెన్షన్లు ఆపుతామంటున్నారు. సామాజిక పట్టాలు, పెన్షన్లు మీకాదు. వైకాపా వారికి బుద్ధి ఉందా? ఎవరి పింఛన్లు కట్‌చేస్తారు? మాకు కూడా ఫైనాన్స్, జలజీవన్ మంత్రి ఉన్నారు. మీరు రోజూ ఢిల్లీలో ఎవరి వద్దకు వెళ్లి డబ్బులు అడుగుతున్నారో మీకు మాకు తెలుసు. భాజపా కార్యకర్తలపై దాడులు చేస్తున్న స్థానిక ఎమ్మెల్యే, అతని అనుచరులు జాగ్రత్తగా ఉండాలి. మీ దురాగతాలు సహించం. భాజపా మీ గుండెల్లో నిద్రపోతుంది. మీ అక్రమాలు, ఇసుకదోపిడి భాజపా కార్యకర్తలు చూస్తూ ఉరుకోరు.’’ అని సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు.

సంక్షేమం చేసేది జగన్ కాదు భాజపానే…. దేశంలో అత్యధిక జనాభా ఉన్న ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చామని సోము వీర్రాజు అన్నారు.. ఈరోజు పార్లమెంటులో ఓబీసీ రిజర్వేషన్లు ఏర్పాటు సౌకర్యంపై చట్టం చేశాం. స్వాతంత్ర్యానరంతరం 70ఏళ్లకు బీసీ వర్గానికి చెందిన నరేంద్రమోదీ ప్రధాని అయ్యారు. దేశాన్ని రక్షిస్తూ ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతలు సాధించిపెడుతున్నారు. తమకు ఇస్తున్న ప్రాధాన్యతను గుర్తించిన బీసీలంతా ఇప్పుడు ఎపీలో భాజపా వైపు చూస్తున్నారు. రైతులకు ఏడాదికి రూ.6 వేలు నరేంద్రమోదీ ఇవ్వడం లేదా? ప్రతి గ్రామంలో నరేగా జాబ్ కార్డులతో 100 రోజులు పనిదినాలు కల్పిస్తూ, రూ. 20 వేలు మోదీ ఇవ్వడం లేదా? స్కూలుకెళ్తే 3 జతల యూనిఫాం, మధ్యాహ్నభోజన పథకం మోదీ ఇస్తున్నారు. మీకిచ్చే బియ్యంలో కేజీకి రూ.33 కేంద్రం ఇస్తుంది. జగన్ ఒకరూపాయి ఇస్తుంటే, మనం ఒక రూపాయి ఇస్తున్నాం. ఇలా దేనికైనా కేంద్రమే సబ్సిడీని ఇస్తుంది. జగనన్న నవరత్నాలు ఇస్తే మనం వంద రత్నాలు ఇస్తున్నాం. పార్టీలు, వర్గాలు చూడకుండా కోటి ఎల్స్ఈడీ బల్బులు ఇచ్చాం. నవంబరు వరకు ఉచిత బియ్యం ఇస్తున్నామని తెలిపారు.

తిరుపతి నుంచి బెంగుళూరుకు జాతీయ రహదారిని మోదీ వేస్తున్నారని సోము వీర్రాజు తెలిపారు. తిరుపతి నుంచి నాయుడుపేట నాలుగులైన్ల రహదారి, కావలి- కనిగిరి, ఏర్పేడు- నకిరికల్లు, వెంకటగిరి- పెంచలకోన, చిత్తూరు- పుత్తూరు రోడ్లు మోదీనే వేస్తున్నారు. గ్రామాల్లో గ్రామీణ సడక్ యోజనతో రోడ్లు వేస్తున్నారు. మీ జగన్ ఏం రోడ్లు వేస్తున్నారు? ఒక్కటీ వేయలేదు. అన్నీ గుంతలే. గుప్పెడు మట్టి వేయలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 14, 15 ఆర్ధిక సంఘాల నిధులిచ్చాం. స్మార్ట్‌సిటీలకు నిధులిస్తున్నాం. తిరుపతిని స్మార్ట్‌సిటీ చేస్తున్నాం. విశాఖను స్మార్ట్‌సిటి చేస్తున్నాం. చిత్తూరు మున్సిపాలిటీకి రూ.500 కోట్ల అమృత్ నిధులిచ్చాం. మీరేమిచ్చారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఐసీడీఎస్ పాఠశాలలు, స్కూలు భవనాలు, జగనన్న క్లినిక్‌లు మోదీ కట్టిస్తున్నారు. 6 వేల వైద్యఆరోగ్య కార్యకర్తల ఉద్యోగాలిచ్చాం. సంక్షేమం పేరుతో అప్పులుచేస్తారా? అని ప్రశ్నించారు.

అభివృద్ధి, అవినీతి లేని పాలన మోదీ సొంతమని సోము వీర్రాజు అన్నారు.. మోదీకి కారు, ఇల్లు లేదు. చంద్రబాబు, జగన్ కు భవనాలు, డైరీలు, ఫ్యాక్టరీలు కావాలి. కుటుంబపాలన కావాలో, అవినీతి కావాలో, అభివృద్ధి కావాలో ప్రజలు తెలుసుకోవాలి. ఎపీ అభివృద్ధి భాజపా సొంతమని వైకాపా, తెదేపాకు చెబుతున్నా. ఈ రాష్ట్రంలో కుటుంబపాలన అమలవుతోంది. తండ్రి నుంచి కొడుకు, చిన్నాన్న, అక్క, చెల్లి, మేనమామ, ఇలా అందరూ పార్టీలో సభ్యులే. ఎమ్మెల్యే అయితే కొడుకు వచ్చేసి పాలిస్తున్నాడు. మోదీ తల్లినే దూరంగా పెట్టారు. ఇలాంటి రాజకీయవ్యవస్థలో భాజపా వంటి పార్టీ మరోటి ఉందా? భాజపాను చూసి వైకాపా సిగ్గుతో తలొంచుకోవాలి. చంద్రబాబుకు కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి అధికారం కావాలి. భాజపాకు కుటుంబాలు లేవు. దేశమంతా భాజపా కుటుంబమేనని భరోసా కల్పించారు.

వైసీపీ గుండాలు దాడిచేస్తే దేశభక్తిగల కార్యకర్తలుగా ఛాతీవిరుచుకుని తరిమికొట్టండని కార్యకర్తలకు సోము వీర్రాజు పిలుపునిచ్చారు. దమ్ము, ధైర్యం, నీతి, సంకల్పం ఉన్న పార్టీ భాజపా. నాయకులు వ్యాపారాలు చేసుకుంటూ, భూం-భూం బీర్లు అమ్ముతున్నారు. అభివృద్ధి మనది. అధికారం, అవినీతి, ఎర్రచందనం వారిది. ఒక దివ్యాంగుడైన డీఎస్పీని ఎర్రచందానికి కాపలా పెట్టి దోచుకుపోతున్నారు.

చంద్రబాబు, జగన్ కలసి జిల్లాలో రెండు షుగర్ ఫ్యాక్టరీలు మూతబెట్టేశారు. రూ. 10 కోట్ల నుంచి రూ.20 కోట్లు ఖర్చుచేస్తే అవి తెరిపించవచ్చు. కాని అవి ఇవ్వరు. షుగర్ ఫ్యాక్టరీలు ఎందుకు తెరవలేదో జగన్, విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలని సోమువీర్రాజు డిమాండ చేశారు.. స్పిన్నింగ్ మిల్లులు అమ్ముతున్నారు. డైరీలు ప్రైవేటు వారికి అప్పగిస్తున్నారు. మీరే పాలవ్యాపారం చేసుకుంటున్నారు…మీరు చేసేది ప్రైవేటైజేషన్ కాదా? స్టీల్ ప్లాంటును ఉంచేయమంటారు. విశాఖజిల్లా తుంపాలలో షుగర్ ఫ్యాక్టరీని తెరిచే దమ్ము జగన్‌కు లేదు. వేలకోట్ల నష్టం వస్తున్నా స్టీల్ ప్లాంటును భాజపా ఈ నాటికి కాపాడింది.

మేకిన్ ఇండియాలో భాగంగా కొచ్చిన్‌లో రూ.75 వేల కోట్ల విలువైన యుద్ధపరికరాలను కేవలం రూ.23 వేల కోట్లతోనే తయారుచేశామని సోము వీర్రాజు తెలిపారు.. రాబోయే రోజుల్లో వీటిని విదేశాలకు ఎగుమతులు చేస్తాం. ఇలాంటి సాంకేతికతో దేశాన్ని అభివృద్ధి చేస్తోంది భాజపా ప్రభుత్వం. దేశం కోసం మంత్రులు 24 గంటలు పనిచేస్తున్నారు. ఎపీని, గుజరాత్ కంటే ప్రధాన రాష్ట్రంగా అభివృద్ధి చేయాలనేది భాజపా లక్ష్యం.

కార్యకర్తలంతా పార్టీని మండలాల్లో అభివృద్ధి చేయాలని వీర్రాజు సూచించారు.. అన్ని మోర్చాలు కమిటీలు వేయాలి. సమావేశానికి 200 మంది హాజరుకావాలి. ప్రతివారం స్పందన కార్యక్రమంలో గ్రామ సమస్యలపై విజ్ఞాపన పత్రాలు ఇవ్వాలి. నెలకోసారి సమావేశం నిర్వహించి సమస్యలపై తీర్మానించి గ్రామాల్లో ఊరేగింపులు చేయాలి. ప్రతి కార్యకర్త జగనన్న గుండెల్లో నిద్రపోవాలన్నారు.

– బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి నిప్పులు..
యాదలమర్రిలో వైకాపా గుండాల అరాచకం పేట్రోగిపోతుందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.. ఏడాది క్రితం జరిగిన జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులపై దాడులు చేశారు. నామినేషన్ ఫారాలు చింపేసి బెదిరించారు. పోలీసుల సహకారంతో మద్యం అమ్ముతున్నట్లు అక్రమ కేసులు పెట్టించారు. ఇద్దరిని బెదిరిస్తే వెయ్యి మంది ఇక్కడికొచ్చి కూర్చున్నారు. భాజపా సత్తా ఇది. మా సమావేశానికి ఎన్ని అడ్డంకులు సృష్టించాలనుకున్నా మీవల్ల కాలేదు. వీధిరౌడీలుగా ఉంటూ చట్టసభలకు దౌర్జన్యంగా ఎన్నికై దేవాలయ భూములను కబ్జా చేసే మీరు జిల్లాలోనే కాదు ఎపీలోనూ భాజపాను ఏంచేయలేరు. ఇసుక దోపిడి, ఇళ్ల నిర్మాణం, కేటాయింపులు చేయకపోవడం, భూ సేకరణలో అవినీతిపై 3 నెలలుగా భాజపా పోరాడుతోంది. రెండేళ్లుగా ఒక్కరోడ్డు వేయలేదు. 1400 రోడ్ల టెండర్లు పిలిస్తే 40 మంది మాత్రమే కాంట్రాక్టర్లు వచ్చారు. వెయ్యిమంది కాంట్రాక్టర్లు ఈ రాష్ట్రంలో రోడ్లు వేయలేమని తిరస్కరించిన ప్రభుత్వం ఇది. 18 రాష్ట్రాల్లో అధికారం ఉండి, 17 కోట్ల మంది సభ్యత్వం గల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి సభను అడ్డుకోడానికి మీకెంత ధైర్యం? ప్రధాని వస్తే నల్లబెలూన్లతో వ్యతిరేకించిన వ్యక్తి ఇప్పుడు ఓడిపోయి వేరేరాష్ట్రానికి పారిపోయిన విషయం గుర్తులేదా? ఎపీలో భాజపా మాత్రమే ప్రతిపక్షపార్టీ. భాజపా కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉంటుంది. మీ దౌర్జన్యాలను ఎదుర్కొంటుందని విష్ణు తెలిపారు.

సభాధ్యక్షులుగా భాజపా చిత్తూరు జిల్లా పార్లమెంటు అధ్యక్షులు రామచంద్రుడు, రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్, తిరుపతి పార్లమెంటు జిల్లా అధ్యక్షులు దయాకరరెడ్డి, నిషితారాజ్, పుష్పలత, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు చిట్టిబాబు, రవికుమార్, రమేష్ నాయుడు, ఒబీసీ రాష్ట్ర నాయకులు అట్లూరి శ్రీనివాసులు, జిల్లా సీనియర్ నాయకులు పురుషోత్తం నాయుడు, విజయేంద్రయాదవ్, వాసు, వేణు యాదవ్, మనోహర్, దేవరాజ్, సురేష్, శివ, సునిల్, శేఖర్‌రెడ్డి, సుబ్రహ్మణ్య యాదవ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

తవణంపల్లి మండలానికి చెందిన నీతిచౌదరి ఆధ్వర్యంలో, దళితమోర్చా నేత శ్రీ బాబు నేతృత్వంలో, వడివేలు ఆధ్వర్యంలో, గిరిజమోర్చా ఆధ్వర్యంలో వందలాది కార్యకర్తలు బీజేపీలో చేరారు. భాజపా అధ్యక్షులు సోము వీర్రాజు వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Back to top button