ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

సోము వీర్రాజు వ్యూహం.. కన్నా పూర్తిగా సైడ్ అయినట్లేనా?

సోము వీర్రాజు కమిటీలో చంద్రబాబు అనుకూలవాదులు లేకుండా ఆయన జాగ్రత్త పడ్డారు..

Kanna-will-again-upset-Somu-Veeraju
ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా  కన్నా లక్ష్మీనారాయణను తప్పించి సోము వీర్రాజును అధిష్టానం నియమించిన సంగతి తెల్సిందే. నాటి నుంచి వీర్రాజు తన మార్క్ రాజకీయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. వరుసగా కాపు నేతలను కలుస్తూ వారందరికీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియామకం అయ్యాక ఆయన నేరుగా మెగాస్టార్ చిరంజీవికి ఇంటికి వెళ్లి చర్చలు జరుపడం అప్పట్లో ప్రాధాన్యత సంతరించుకుంది. చిరంజీవి జనసేనతో కలిసి పని చేయాలని సూచించినట్లు ఆయన మీడియా ముందు చెప్పడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

Also Read: అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ : జగన్ సర్కార్ కు ఎదురుదెబ్బ

ఆ తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్ ను వీర్రాజు కలుసుకున్నారు. వీర్రాజు వరుస పర్యటనలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకోవడంలో సక్సస్ సాధించారు. తనకుంటే ముందు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగిన కన్నా లక్ష్మీనారాయణ కంటే తానే బెటర్ అనేలా సోము వీర్రాజు శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. బీజేపీలో ఉంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అనుకూలంగా వ్యవహరిస్తున్న పలువురు నేతలకు నోటీసులు, సస్పెషన్ లతో హాల్చల్ సృష్టించారు. మరోవైపు బీజేపీ కోసం కష్టపడుతున్న నాయకులకు పార్టీలో పెద్దపీఠ వేస్తున్నారు. ఏపీలో బీజేపీ బలపడేలా వీర్రాజు చర్యలు చేపడుతుండటంతో అధిష్టానం కూడా సోముకు మద్దతుగా నిలుస్తోంది.

వీర్రాజు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియామకం అయ్యాక కొత్త కమిటీని నియమించారు. ఈ కమిటీ కూర్పు చూస్తుంటే సోము వ్యూహం ఏంటో ఇట్టే అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ కమిటీలో ఎక్కడా కూడా చంద్రబాబు అనుకూలవాదులు లేకుండా ఆయన జాగ్రత్త పడ్డారు. పార్టీకి విధేయులుగా పనిచేస్తూ తనకు అనుకూలంగా వ్యవహరించే వారికే కమిటీలో పెద్దపీఠ వేశారు. పార్టీలో తన వాయిస్ మాత్రమే విన్పించేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్నటి వరకు పార్టీలో చక్రం తిప్పిన కన్నా లక్ష్మీనారాయణ, అతని వర్గాన్ని పూర్తిగా సైడ్ చేసేలా కమిటీ కూర్పు కన్పిస్తోంది.

కొత్త కమిటీ తన ముద్ర స్పష్టంగా ఉండేలా వీర్రాజు చూస్తున్నారు. గతంలో కన్నా లక్ష్మీనారాయణ పార్టీ పదవుల్లో కమ్మవారికి ప్రాధాన్యం ఇవ్వగా రెడ్డిలు పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈసారి వీరికి ఆయన సముచిత ప్రాధాన్యం కల్పించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా అమరావతి రాజధాని విషయంలో కన్నా నిర్ణయాన్ని తప్పుబట్టి అన్ని ప్రాంతాలను బీజేపీ సమాన దృష్టితో చూస్తుందని భావనను ప్రజల్లోకి తీసుకెళ్లారు. బీజేపీని అమరావతి ట్రప్ లో ఇరుక్కోకుండా వీర్రాజు చేపట్టిన చర్యలు ఫలించాయి. దీంతో అన్ని ప్రాంతాల్లో బీజేపీకి మరింత బలం చేకూరుతోంది.

Also Read: నేలవిడిచి సాము చేస్తున్న జగన్

కొత్త కమిటీలో కంభంపాటి రామ్మెహన్ రావు, కామినేని శ్రీనివాస్, పురంధేశ్వరీలకు చోటు కల్పించకుండా ఆర్ఎస్ఎస్ మూలాలున్న మాధవ్ కు ప్రాధాన్యం కల్పించారు. ఇది కూడా ఆయనకు మేలు చేసేదిగా కన్పిస్తుంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ-జనసేన కూటమితో కలిసి వెళ్లనుంది. అయితే ఒకవేళ అనివార్య కారణాలతో ఒంటరిగా పోటీచేసినా బీజేపీ ఏపీలో నిలదొక్కుకొనేలా వీర్రాజు పకడ్బంధీ చర్యలు చేపడుతున్నారు. ఏపీలో బీజేపీని బలపర్చడంతోపాటు తనకు పార్టీలో ఎదురులేకుండా వీర్రాజు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి వీర్రాజు మాటకు ఏపీ బీజేపీలో ఎదురుల్లేకుండా పోతుంది. అయితే రానున్న రోజుల్లో వీర్రాజు హవా ఇలానే కొనసాగుతుందో లేదో వేచి చూడాల్సిందే..!

Back to top button