అత్యంత ప్రజాదరణఆంధ్రప్రదేశ్రాజకీయాలుసంపాదకీయం

ఎన్టీఆర్.. తెలుగు జాతి ఖ్యాతిని నలుచెరుగులా చాటిన ‘తారక’రాముడు

*నేడు ఎన్టీఆర్ వర్ధంతి

 

ఢిల్లీలో తెలుగోళ్లు అంటే చులకన.. తెలుగోళ్లు అంటే అవహేళన.. విమానాశ్రయంలోనే ఏపీ సీఎం అంజయ్యను అవమానించిన కాంగ్రెస్ దిగ్గజాల హీన చరిత్ర.. తెలుగు వాడైన పీవీ ప్రధానిగా పోటీచేస్తే పోటీపెట్టకుండా సాయం చేసిన మహనీయుడు మన తారక రాముడు.. తెలుగు చలన చిత్రపరిశ్రమకు ఆదిపురుషుడు.. తెలుగు చలన చిత్ర పరిశ్రమను నిలబెట్టిన యోధుడు ఎన్టీఆర్.. తెలుగు వెండితెర ఇలవేల్పుగా.. అనంతరం రాజకీయ నేతగా చెరగని ముద్రవేసిన ఆయన 25వ వర్ధంతి నేడు.

ఎన్టీఆర్ తెలుగు సినిమాకు చుక్కాని.. తెలుగు సినిమా మొదలైనప్పటి నుంచి ఆయన తెలుగువారితోనే ఉన్నారు. సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఆంధ్రుల అభిమాన ‘అన్నగారు’గా మారారు. అనంతరం రాజకీయాల్లోకి వచ్చి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వేదికగా చాటారు. 9 నెలల్లో కాంగ్రెస్ ను పాతరేసి తెలుగుదేశాన్ని అధికారంలోకి తెచ్చారు.

ఎన్టీఆర్ సినీరంగ ప్రవేశం నుంచి చివరి సినిమా వరకు, రాజకీయాల్లోకి మారాక కూడా విలువలు పాటిస్తూ ఆంధ్రుల గుండెల్లో నిలిచిపోయారు. ఎన్టీఆర్ లోని నటుడిని, దర్శకుడిని నిర్మాతను, కళాకారుడిని, మానవాతమూర్తిని, ప్రయోగశీలిని, వితరణశీలిని, అభ్యుదయ వాదిని, దార్శనికుడిని తెలుగు ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు.  . అందుకే ఆయన మనతో లేకున్నా ఆ యుగ పురుషుడిని మన స్మరించుకుంటూనే ఉంటాం.. నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా ఆయనను తెలుగు సినీ పరిశ్రమ, తెలుగు వారు ఘనంగా  స్మరించుకుంటున్నారు.

తెలుగు వారు ‘అన్నగారు’ అని అభిమానంతో పిలుచుకునే నందమూరి తారకరామరావు మే 28.. 1923లో జన్మించారు.1983లో టీడీపీనీ స్థాపించిన ఎన్టీఆర్‌ది కృష్ణజిల్లా నిమ్మకూర్‌ గ్రామం. ఈ గ్రామం గుడివాడ నియోజకవర్గంలో ఉంది. ఎన్టీఆర్‌ పార్టీ స్థాపించిన తరువాత గుడివాడ నుంచి 1983,85 ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. అయితే  ఆ తరువాత ఎన్టీఆర్‌ అనంతపురం జిల్లా హిందూపురం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన కుమారుడు బాలకృష్ణ సైతం 2014 ఎన్నికల్లో  ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుపొందడం విశేషం.  అల్లుడు చంద్రబాబు అధికారంలోంచి కూలదోసి పగ్గాలు తీసుకోవడంతో మనస్థాపం చెంది 1996 జనవరి 18న ఇదేరోజు గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించారు.

అయితే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు హైజాక్ చేసిన తర్వాత ఎన్టీఆర్ ప్రభ మసకబారింది. చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ చరిత తెరపైకి వచ్చింది. గత ఏడాది హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ లో కనీసం పూలు కూడా పేర్చి కట్టకుండా చంద్రబాబు, టీడీపీ వదిలేసింది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ ఈ బాధ్యతను తాను తీసుకుంటానని.. తానే తాత ఎన్టీఆర్ ఘాట్ కు అలంకరణ చేస్తానని ప్రకటించారు. టీడీపీ ఎన్టీఆర్ ను ఎంతలా వదిలేసిందనడానికి ఇదొక ఉదాహరణ..

మొన్నటి వరకు ఎన్టీఆర్ జయంతి.. వర్ధంతి అంటే ఒక పండుగ.. మహానాడు పేరిట మూడు నాలుగు రోజులు చంద్రబాబు, టీడీపీ నేతలు పెద్ద పండుగలా నిర్వహిస్తారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ ను పూలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. కానీ గత ఏడాది ఎన్టీఆర్ ఘాట్ కళతప్పింది. వెలవెల బోయింది. పూలు లేవు.. ఏర్పాట్లు లేవు.. అవే మొండి సమాధి గోడలు..ఘాట్ వద్ద కనీసం ఒక ఫ్లెక్సీ, ఒక్క పూవు కూడా లేని పరిస్థితి.. ఎందుకీ పరిస్థితి అంటే ఏపీలో టీడీపీ దారుణంగా ఓడిపోవడమే..

టీడీపీ అధికారంలో ఉనన్నీనాళ్లు చంద్రబాబుకు ఎన్టీఆర్ దేవుడు. కానీ ఇప్పుడు ఏపీలో దారుణంగా ఓడిపోయిన వేళ మాత్రం ఎన్టీఆర్ .. చంద్రబాబుకు పట్టకుండా పోయాడు. ఓడినా.. గెలిచినా ఇంత ఎత్తుకు తీసుకెళ్లిన తెలుగుదేశం వ్యవస్థాపకుడిని ఆయన జయంతి నాడు స్మరించుకోవడం కనీస మర్యాద. కానీ ఓటమి భారంతో చంద్రబాబు.. అధికారం కోల్పోవడంతో టీడీపీ నేతలు పట్టించుకోలేదు. ఎన్టీఆర్ జయంతిని గాలికి వదిలేశారు. ఎన్టీఆర్ ఘాట్ లో కనీసం నివాళులర్పించలేదు. చంద్రబాబు తీరుపై ఇప్పటికే అభిమానులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు గుర్రుగా ఉన్నారు.

ఈసారి జూనియర్ ఎన్టీఆర్ బాధ్యత తీసుకున్నాడు. ఎన్టీఆర్ ఘాటును పూలతో అలంకరించాడు. ఎన్టీఆర్ ఘాట్ కు నివాళులర్పిస్తున్నారు. తాతను ఆయన స్థాపించిన టీడీపీ మరిచినా మనవడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మరవకుండా నేడు వర్థంతిని జరుపుతున్నారు. ఎన్టీఆర్ కీర్తి మరిచిపోకుండా కాపాడుతున్నాడు.

-నరేశ్

Back to top button