క్రీడలు

పిచ్చెక్కిస్తున్న‌ స‌న్ రైజ‌ర్స్ ప్ర‌మోష‌న్‌.. బాహుబ‌లి వ‌చ్చేశాడ‌ట‌!

sunrisers hyderabad
అది సినిమా కావొచ్చు.. మ‌రేదైనా ఈవెంట్ అవ్వొచ్చు.. లేదంటే ఐపీఎల్ లాంటీ టోర్నీ కావొచ్చు.. జ‌నాల దృష్టి ప‌డాలంటే మాత్రం ప్ర‌మోష‌నే కీల‌కం. మార్కెటింగే మంత్రం. ఎలాంటి వ్యూహాల ద్వారా జ‌నాల చెంత‌కు చేరామ‌న్న‌దానిపైనే స‌క్సెస్ రేంజ్ ఆధార‌ప‌డి ఉంటుంది. అందుకే.. అంద‌రూ ప్ర‌మోష‌న్ ను అత్యంత కీల‌కంగా భావిస్తారు. త్వ‌ర‌లో ఐపీఎల్ సీజ‌న్ ఆరంభం కాబోతున్న నేప‌థ్యంలో.. ప్ర‌మోష‌న్ స్టార్ట్ చేసింది స‌న్ రైజ‌ర్స్ టీమ్‌. ఏ జ‌ట్టూ తీసుకోని కాన్సెప్ట్ ను ఎంచుకొని, సినిమా క్రికెట్ క‌లిపి ఆడేస్తోంది.

ఆ మ‌ధ్య జూనియ‌ర్ ఎన్టీఆర్ అర‌వింద స‌మేత చి‌త్రానికి సంబంధించిన ఓ పోస్ట‌ర్ ను ఎడిట్ చేసి, క‌త్తి ప‌ట్టుకొని ప‌రుగులు తీస్తున్న‌ ఎన్టీఆర్ బాడీకి.. బ్యాట్స్ మెన్ మ‌నీష్ పాండే ముఖం త‌గిలించింది. దానికి అద్దిరిపోయే క్యాప్ష‌న్ కూడా రాసింది. ‘మనీష్ పాండే నుంచి ఏం కోరుకుంటామో అందరికీ తెలిసిందే.. నిర్ధాక్షిణ్యం తో కూడిన బ్యాటింగ్’ అని జత చేసింది.

ఇటీవల పేస్ బౌలర్ భువనేశ్వర్ ను సూపర్ స్టార్ మహేష్ బాడీతో రీప్లేస్ చేసింది. శ్రీమంతుడు చిత్రంలోని మహేష్ ఇమేజ్ కు భువీ తల తగిలించింది. దీనికి కూడా సూపర్బ్ కామెంట్ జోడించింది. ‘హైదరాబాదీ ఫ్యాన్స్ నాకు చాలా ప్రేమను ఇచ్చారు. పెర్ఫార్మెన్స్ రూపంలో తిరిగి ఇచ్చేయాలి. లేదంటే లావైపోతాను’ అని భువ‌నేశ్వ‌ర్ అన్న‌ట్టుగా రాసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది స‌న్ రైజ‌ర్స్‌. ఈ చిత్రానికి లైకులు, కామెంట్ల వ‌ర్షం కురిసింది.

తాజాగా.. మ‌రో భారీ పిక్ ను రిలీజ్ చేసింది యాజ‌మాన్యం. కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ ముఖాన్ని బాహుబ‌లిలో ప్ర‌భాస్ ఇమేజ్ కు జోడించింది. యుద్ధానికి వ‌స్తున్న వీరుడిలా వార్న‌ర్‌ను ఎడిట్ చేసింది. బాహుబ‌లి టైటిల్ కింద ఇంగ్లీష్ లో డేవిడ్ వార్న‌ర్ అంటూ ఇంగ్లీష్ లో రాసింది. ఇక‌, వార్న‌ర్ రేంజ్ కు స‌రితూగే క్యాప్ష‌న్ కూడా బాహుబ‌లి నుంచి తీసుకుంది.

‘హైదరాబాద్.. ఊపిరి పీల్చుకో. మన కెప్టెన్ వచ్చాడు. డేవిడ్ వార్నర్ తిరిగి వచ్చాడు.’ అని పవర్ ఫుల్ కామెంట్ యాడ్ చేసింది. సన్ రైజర్స్ ఇన్ స్టా అకౌంట్లో పోస్టు చేసిన ఈ పిక్ వైర‌ల్ అవుతోంది. ఈ ప్ర‌మోష‌న్ చూస్తున్న నెటిజ‌న్లు.. ఎస్ఆర్‌హెచ్ కేక పెట్టిస్తోంద‌ని కామెంట్ చేస్తున్నారు.

Back to top button