తెలంగాణరాజకీయాలు

వైఎస్ షర్మిల భర్తతో భేటీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్లారిటీ

T Rajaiahపార్టీ మారుతున్నట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్పష్టం చేశారు. వైఎస్ షర్మిల భర్త అనిల్ కుమార్ తో భేటీ అయిన విషయం సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న నేపథ్యంలో ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు. తన ఎదుగుదలకు సహకరించిన టీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. అది నూటికి నూరు శాతం ఫేక్ న్యూస్ అని కొట్టిపారేశారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. 2019లో ఓ సమావేశంలో పాల్గొనడానికి వచ్చినప్పుడు అనిల్ తో దిగిన ఫొటో అదని అన్నారు. అంతే కాని తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న పుకార్లలో నిజం లేదని వివరించారు.

టీఆర్ఎస్ లో ఎవరికి ఇవ్వని ప్రాధాన్యత సీఎం కేసీఆర్ తనకు ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. అడగకుండానే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించారని అన్నారు. అంతేకాదు తనకు ఇస్టమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవి కూడా ఇచ్చి తనకు ఎంతో గుర్తింపు ఇచ్చారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. కేసీఆర్ దళితుల కోసం ప్రవేశ పెట్టిన దళితబంధు పథకం దేశంలోనే ఉత్తమ పథకంగా గుర్తింపు పొందడం ఖాయమన్నారు.

అయితే షర్మిల భర్త అనిల్ కుమార్ తో ఎమ్మెల్యే రాజయ్య ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీంతో రాజయ్య పార్టీ మారతారని ప్రచారం ఊపందుకుంటోంది. దీనిపై రాజయ్య క్లారిటీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజయ్య టీఆర్ఎస్ పార్టీని వీడడం లేదుని తేల్చి చెప్పారు. అప్పట్లో డిప్యూటీ సీఎం పదవి పోయినప్పుడు తనకు ఇతర పార్టీలు అవకాశం ఇచ్చినా తాను చేరేందుకు మొగ్గు చూపలేదని గుర్తు చేశారు.

ఇప్పటికే షర్మిల పార్టీలోకి కొందరు నేతలు వెళ్తున్నట్లు సమాచారం రావడంతో రాజయ్య కూడా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రాజయ్య మాత్రం తాను పార్టీ వీడడం లేదని చెబుతున్నారు. ఇప్పటికే షర్మిల రాష్ర్టంలో నిరుద్యోగుల సమస్యలపై పోరాడేందుకు ప్రాధాన్యం ఇస్తుండడంతో ఆ పార్టీ వైపు కొందరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను సైతం షర్మిల పరామర్శించింది. ఈ నేపథ్యంలో పలు పార్టీల నేతలు వైఎస్సార్ టీపీ లో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Back to top button