ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

ఎన్నికల్లో పోటీ చేయం బాబోయ్‌ అంటున్న తమ్ముళ్లు

MPTC, ZPTC Elections

ఏపీలో మొదటి నుంచీ శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌‌ కూడా ఒకానొక టైమ్‌లో అక్కడ పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ కేరాఫ్‌ అంటే శ్రీకాకుళం జిల్లా అన్నట్లు ఉండేది. కానీ.. రెండేళ్లుగా ఆ పరిస్థితి పూర్తి భిన్నంగా తయారైంది. సిక్కోలులో గత సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కళా వెంకటరావు ఓడిపోతే, తాజాగా జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రస్తుత ప్రెసిడెంట్ అచ్చెన్నాయుడు ఇలాకాలోనూ పార్టీ దెబ్బతింది.

ఇక మహామహులైన టీడీపీ నేతలకూ సొంతూళ్లలో దెబ్బ తప్పలేదు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో పార్టీ పరిస్థితి అథమ స్థాయికి చేరింది. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ పరిస్థితి మీద ఒక సర్వే చేయిస్తే అందులో విస్తుబోయే నిజాలు వెలుగు చూశాయని టాక్. అధికార వైసీపీ బలం తగ్గిందా..? టీడీపీ పుంజుకుంటుందా..? అంటూ చేసిన సర్వేలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. తమ్ముళ్ల నుంచే అక్కడ పూర్తి నైరాశ్యం కనిపిచింది. ‘మేము పూర్తిగా చితికిపోయాం. ఇప్పట్లో ఏ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో లేం.’ అని తమ్ముళ్లు తెగేసి చెప్పారట. అంతేకాదు.. తాము లక్షలు పోసి పోటీపడలేమని కూడా తేల్చేశారట. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో తాము నిలబడమని కూడా స్పష్టంగా చెప్పేశారని టాక్.

ఇక దీంతో టీడీపీకి దిమ్మతిరిగినట్లైంది. నేడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థులను వెతుక్కోవాల్సిన దుస్థితే వచ్చింది. పార్టీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం జిల్లాలో పార్టీ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొనలేదు. టీడీపీకి ఇదే తొలి ఓటమి కాదు.. ఇంతకుముందు కూడా మూడు సార్లు ఓడింది. అయితే.. నాటికీ నేటికీ చాలా తేడా ఉందని తమ్ముళ్లే అంటున్నారు. అప్పట్లో కాంగ్రెస్ అధికారంలో ఉండేది. పైగా అది జాతీయ పార్టీ. దాంతో రాష్ట్రంలో ఉన్న నాయకులు కానీ, పెద్దలు కానీ జిల్లా మీద పూర్తి ఫోకస్ పెట్టేవారు కాదు. ఇక కాంగ్రెస్‌లో ఉన్న గ్రూప్ రాజకీయాలతో కూడా టీడీపీ బతికి బట్ట కట్టేసేది. మరోవైపు కాంగ్రెస్‌లో పడని గ్రూపులే టీడీపీని గెలిపించేందుకు కూడా ఇండైరెక్ట్‌గా కృషి చేసేవి.

కానీ.. ఇప్పుడు డైరెక్ట్ ఫైట్ కంటిన్యూ అవుతోంది. అది కూడా ఏకంగా వైసీపీ హైకమాండ్ నుంచే మానిటరింగ్ నడుస్తోంది. డూ ఆర్ డై అన్నట్లుగా వైసీపీ క్యాడర్‌‌ను రెడీ చేసి టీడీపీ మీదకు పంపుతోంది. మరోవైపు.. తెలుగుదేశం అధినాయకత్వం కూడా దీటుగా పోరాడమంటోంది. పైగా కేసులు పెట్టినా కూడా భయపడవద్దు అంటోంది. కానీ.. లోకల్ బాడీ ఎన్నికల్లో తెగించి పోరాడిన వారంతా ఇపుడు ఓడిపోయి కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చూస్తే క్యాడర్ కూడా నిరుత్సాహంలో ఉంది. నేతలు చెబుతున్నా కూడా బయటకు రాలేని పరిస్థితి ఉందని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉండడం, పోలీసుల మద్దతు కూడా వైసీపీకి ఉండడంతో ఢీ కొట్టలేకపోతున్నారు అని అంటున్నారు. కంచుకోట లాంటి శ్రీకాకుళం జిల్లాలోనే పసుపు పార్టీ ఇలా చేతులు ఎత్తేస్తే ఇక మిగిలిన జిల్లాల్లో సర్వేల్లాంటివి అవసరమా అనే అభిప్రాయాలు కలుగక మానవు.

Back to top button