ఆంధ్రప్రదేశ్తెలంగాణరాజకీయాలు

ఏపీ స‌ర్కారుః కేసీఆర్ చెప్పింది నిజ‌మేగా?!

Jagan KCR

‘‘ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఏమీ లేదు.. అంతా పోయింది. అభివృద్ధి మొత్తం తెలంగాణ‌లోనే ఉంది.’’ ఇదీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ అన్న మాట‌. హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన పాడి కౌశిక్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్న సంద‌ర్భంగా టీఆర్ఎస్ భ‌వ‌న్లో మాట్లాడుతూ.. కేసీఆర్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ నేత‌లు దీన్నొక‌ పొలిటిక‌ల్‌ కామెంట్ గా తీసిప‌డేసే ప్ర‌య‌త్నం చేయొచ్చు. కానీ.. వాస్త‌వం అనేది ఒక‌టి ఉంటుంది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చి దాదాపు స‌గం కాలం కావస్తోంది. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన అభివృద్ధి ఏంటో చూప‌మ‌ని అడిగితే.. స‌మాధానం క‌నిపించ‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

కేవ‌లం సంక్షేమ జ‌పం చేస్తున్న ఏపీ స‌ర్కారు.. అందుకోసం అప్పులు తెచ్చిమ‌రీ ఖ‌ర్చు చేస్తుండ‌డం ఆందోళ‌న క‌లిగించే అంశం. రాష్ట్రంలో ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితుల్లో ఉండ‌డం మ‌రింత బాధాక‌రం. ఈ నెల జీతాలు చెల్లించేందుకు ప్ర‌భుత్వం ఎన్ని పాట్లు ప‌డిందో తెలిసిందే. ఓడీలు స‌హా.. అన్ని ప‌రిమితులూ దాటిపోయి.. దివాలా అంచున రాష్ట్రం నిల‌బ‌డింద‌నే వార్త‌లు వ‌చ్చాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో అభివృద్ధి ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాలు అనే మాటే లేకుండా పోయింది ఏపీలో.

కానీ.. తెలంగాణ‌లో ఇందుకు భిన్నంగా సాగుతోంది. మొన్న‌టికి మొన్న కిటెక్స్ అనే సంస్థ వెయ్యి కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకు వ‌చ్చింది. మైక్రోసాఫ్ట్ కూడా వేల కోట్లు పెట్టేందుకు సిద్ధ‌మైంది. త‌ద్వారా.. తెలంగాణ రాష్ట్రం మ‌రింత‌గా అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతోంది. ఇదే స‌మ‌యంలో ఏపీలో ఉన్న ప్రాజెక్టులు జారిపోతున్నాయి. తిరుప‌తి స‌మీపంలో రిల‌య‌న్స్ పెట్టాల‌ని భావించిన ప్రాజెక్టు ఒక‌టి.. డీల్ క్యాన్సిల్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే. దీంతో.. స‌హ‌జంగానే రెండు రాష్ట్రాల మ‌ధ్య పోలిక‌లు వ‌స్తున్నాయని అంటున్నారు.

రాష్ట్రానికి సంక్షేమం కావాల్సిందే. ప్ర‌జ‌ల‌కు ప‌థ‌కాల ద్వారా చేయూత‌నివ్వాల్సిందే. కానీ.. అప్పు చేసి మ‌రీ పప్పు కూడు పెడితే దాన్ని ఎలా తీరుస్తారు అన్న‌ది ప్ర‌శ్న‌. ఆదాయం లేకుండా.. నెల‌లా, ఏటికేడు అప్పుల కుప్ప‌లు పెంచుకుంటే పోతే ప‌రిస్థితి ఏంట‌న్న‌ది మ‌రో ఆందోళ‌న‌. ఆదాయ మార్గాలు చూప‌కుండా.. ఉపాధి అవ‌కాశాలు పెంచ‌కుండా.. అభివృద్ధి ప్రాజెక్టులు తీసుకురాకుండా.. రాష్ట్రం ఏవిధంగా డెవ‌ల‌ప్ అవుతుంద‌న్న‌ది అస‌లైన ప్ర‌శ్న‌. ఇన్ని పిత‌లాట‌కాలు ఉన్నాయి కాబ‌ట్టే.. ఆంధ్ర‌లో అంతా డొల్లేన‌ని కేసీఆర్ వ్యాఖ్యానించార‌ని, ఇందులో నిజం లేదా? అని స‌గ‌టు పౌరులు నిల‌దీస్తున్నారు.

Back to top button