వ్యాపారము

రైతు బంధుతో సమస్యలా.. కాల్ చేయాల్సిన నంబర్లు ఇవే..?   

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు ప్రయోజనం చేకూరేలా రైతుబంధు స్కీమ్ నగదును ఖాతాలలో జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే రైతుబంధు సొమ్ము విత్ డ్రా చేసుకోవడంలో రైతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కొన్ని బ్యాంకులు రైతుబంధు నగదును పాతబకాయిల కింద జమ చేసుకుంటున్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. రైతుల సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

 

బ్యాంకర్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ బ్యాంకర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. బ్యాంకర్లు ఈ సందర్భంగా రైతుబంధు నిధులను నిలిపివేయడానికి ఎటువంటి ఆదేశాలు జారీ కాలేదని వెల్లడించడం గమనార్హం.

 

ఆర్థిక మంత్రి హరీష్ రావు రైతుబంధుకు సంబంధించి ఎలాంటి మొత్తాన్ని నిలిపివేయవద్దని బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు. నిలిపివేయబడిన/సర్దుబాటు చేయబడిన ఏదైనా మొత్తం ఉంటే రైతుల ఖాతాలలో జమ చేయాలని హరీష్ రావు అన్నారు. బ్యాంకర్లు తమ తమ బ్యాంకు బ్రాంచీలకు ఇందుకు సంబంధించిన ఖచ్చితమైన ఆదేశాలను జారీ చేయాలని హరీష్ రావు కోరారు.

 

జిల్లా కలెక్టర్లు ఈ విషయాన్ని జిల్లా స్థాయిలో పర్యవేక్షించటానికి హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి టీం రైతుల సమస్యలను మానిటరింగ్ చేస్తుందని చెప్పారు. 1800 – 200 – 1001, 040 – 33671300 నంబర్ల ద్వారా రైతుబంధుకు సంబంధించిన సమస్యలను రైతులు ఫిర్యాదు చేసి పరిష్కరించుకోవచ్చు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ నంబర్లు పని చేస్తాయి.

Back to top button