జాతీయంరాజకీయాలు

చంద్రబాబు, లోకేష్ కదిలిరావాల్సిందేనా?


ఇన్నాళ్లు కరోనా-లాక్ డౌన్ నిబంధనలు స్టిక్ట్ గా ఉండడంతో తెలంగాణలోని హైదరాబాద్ లో సొంతింటిని వీడి ఆంధ్రప్రదేశ్ కు వెళ్లలేకపోయిన చంద్రబాబు ఇక తెలంగాణను వీడే సమయం వచ్చింది. ఎల్లో మీడియా సహకారంతో ఏపీలో లేకున్నా వార్తల్లో నిలుస్తూ హైదరాబాద్ నుంచి చక్రం తిప్పిన బాబు ఇప్పుడు ఏపీలో అడుగుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సీఎం జగన్ అన్నింటికి సడలింపులు ఇవ్వడం.. సాధారణ స్థితికి ఏపీ చేరుకోవడం.. రేపటి నుంచి బస్సులు కూడా ఏపీలో ప్రారంభిస్తుండడంతో చంద్రబాబు ఇక ఏపీలో అడుగుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది..

*చంద్రబాబుకు దూరంగా తెలుగుతమ్ముళ్లు
10, 20, 30రోజులు.. రెండు నెలలు కావొస్తోంది. ఏపీ ప్రతిపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబును డైరెక్టుగా, టీవీల్లో చూడలేక తెలుగు తమ్ముళ్లు, ఆంధ్రులు తెగ బాధపడిపోతున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 71 ఏళ్ల చంద్రబాబు ఎలా ఉన్నాడు? పక్క రాష్ట్రంలో ఏం తింటున్నాడు. కరోనాకు భయపడి ఆంధ్రాకు రాడా అని ఇన్నాళ్లు తెగ బాధపడ్డారు. కానీ ఇప్పుడు ఆ రోజు రానే వచ్చింది. చంద్రబాబు ఏపీలో అడుగుపెట్టే తరుణం ఆవిష్కృతం కాబోతోంది. చంద్రబాబు రాక కోసం తెలుగు తమ్ముళ్లు అంతా కాచుకు కూర్చున్నాయి. వెలవెలబోయిన టీడీపీ రాజకీయం ఇక బాబు రాకతో స్పీడందుకోనుంది.

*అన్నింటిని తెరిచేసిన జగన్
ఏపీ సీఎం జగన్ నిన్నటి విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో అన్నింటికి రిలాక్స్ ఇచ్చాడు. బస్సులు మొదలు దుకాణాలు, వ్యాపారాలు, వాణిజ్యాలు, పరిశ్రమలు అన్నింటిని తెరిచి పనులు చేసుకోవచ్చని అభయం ఇచ్చారు. దీంతో కరోనా-లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఇన్నాళ్లకు ఏపీలో మళ్లీ సాధారణ పరిస్థితి ఏర్పడబోతోంది. దీంతో ఇప్పుడు కూడా చంద్రబాబు రాకపోతే టీడీపీకి రాజకీయంగా గడ్డు కాలం. పైగా జగన్ విచ్చలవిడిగా లాక్ డౌన్ సడలిస్తూ కరోనా వ్యాప్తి చేయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. పక్కరాష్ట్రంలో ఉండే వాయిస్ వినిపిస్తే అది జనాల్లోకి ఎక్కదు. సో ఏపీలోకి ఎంట్రీ ఇచ్చి జగన్ పై విరుచుకుపడేలా చంద్రబాబు సమాయత్తమవుతున్నారు.

*చంద్రబాబు ఏపీకి రావడమే తరువాయి..
ఏపీలో అన్ని తెరిచాక.. అంతా ఓపెన్ చేశాక ఇక చంద్రబాబు కూడా ఎందుకు ఆగుతాడు అని తెలుగు తమ్ముళ్లు ధీమాగా చెబుతున్నారు. ఇన్నాళ్లు పక్కరాష్ట్రం నుంచి ఏపీలోకి అడుగుపెడితే 14 రోజులు హోం క్వారంటైన్ లో ఉంచింది ఏపీ సర్కార్. చంద్రబాబు వచ్చినా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లాంటి వారు సూచించారు కూడా. దీంతో ఇప్పటిదాకా రాజకీయంగా ఇబ్బందులు.. ఎందుకు రిస్క్ తీసుకోవాలని మిన్నకుండిన బాబు.. ఇప్పుడు ఏపీలో అంతా సాధారణ పరిస్థితి నెలకొనడంతో ఏపీ బాట పడుతున్నారు. లాక్ డౌన్ భారీ మినహాయింపులు నేపథ్యంలో సాధారణ జనజీవనం ఏర్పడ్డ తరుణంలో చంద్రబాబు ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టబోయే సమయం ఆసన్నమైంది.. ఆయనతోపాటు లోకేష్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ తండ్రీ కొడుకుల రాకకోసం తెలుగు తమ్ముళ్లు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

-నరేశ్ ఎన్నం