టాలీవుడ్సినిమా

టాలీవుడ్ పై మేలుకున్న కేసీఆర్!

ఎప్పుడైనా పీకలదాకా మునిగే సందర్భం వస్తేనే మన తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందిస్తుంటారనే టాక్ ఉంది. ఇప్పుడూ అదే జరిగింది. లాక్ డౌన్ కరోనా విపత్తు తర్వాత ఈ మధ్యే తెలంగాణ, ఏపీలో ఇద్దరు సీఎంలు అన్నింటికి ద్వారాలు తెరిచారు. అయితే తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోలేదు కేసీఆర్. మొత్తం టాలీవుడ్ హైదరాబాద్ లో ఉండడంతో వారికి ఈ పరిణామం మింగుడు పడలేదు. అదే సమయంలో ఏపీలో షూటింగ్ లకు సీఎం జగన్ అనుమతి ఇవ్వడంతో అటు వెళదామని అనుకున్నారు. అయితే పరిశ్రమ ఇక్కడే ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం కోసం సినీ ప్రముఖులు వేచి ఉన్నారు. సీఎం జగన్ టాలీవుడ్ ను లాగేస్తాడన్న అనుమానం రావడంతో కేసీఆర్ రంగంలోకి దిగారు. తాజాగా ఈ సాయంత్రం టాలీవుడ్ సినీ పెద్దలతో స్వయంగా భేటి అయ్యారు.

*నిన్న తలసానితో.. నేడు కేసీఆర్ తో సినీ పెద్దల భేటి
నిన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో చర్చించిన టాలీవుడ్ సినీ పెద్దలు తాజాగా ఈరోజు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటి అయ్యారు. ఇప్పటికే సినిమా పెద్దలు లేవనెత్తిన సమస్యలపై నిన్న మంత్రి తలసాని శ్రీనివాస్.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయాలపై ఈరోజు కేసీఆర్ తో సినీ పెద్దలు చర్చించనున్నారు. ముఖ్యంగా లాక్ డౌన్ నిబంధనలకు లోబడి సినిమా షూటింగ్ లు చేసుకోవడం.. థియేటర్లు తెరవడంపై ఆయనతో చర్చించనున్నారు.

*సినీ పెద్దల డిమాండ్లు ఇవీ..
సినీ పెద్దలు తాజాగా లాక్ డౌన్-కరోనాతో కుదేలైన సినిమా పరిశ్రమకు రాయితీలు, పన్ను మినహాయింపులు ఇవ్వాలని కేసీఆర్ ను కోరనున్నారు. రిలీజ్ కాబోయే సినిమాలకు పన్ను రాయితీని అడగబోతున్నారు. ఇక షూటింగ్ లు మొదలు పెడితే పరిమిత సంఖ్యలో 50 మందితో ఇన్ డోర్, ఔట్ డోర్ షూటింగ్ లు ఎలా చేస్తామన్నది ప్రజంటేషన్ రూపంలో సీఎంకు సమర్పించనున్నారు. థియేటర్లలో సోషల్ డిస్టేన్స్ పాటిస్తూ సీట్లను కేటాయించి ప్రదర్శనలు చేస్తామని.. వాటికే ట్యాక్స్ కట్టేలా చూడాలని కోరనున్నారు. ఇక షూటింగ్ లకు ఇతర రాష్ట్రాల్లో అనుమతులు లేనందున ఇక్కడ ఉన్న లోకేషన్లలో షూటింగ్ చేసుకునేందుకు కొంత రాయితీ ఇవ్వాలని కేసీఆర్ ముందు ప్రతిపాదనలు చెయ్యనున్నారు.

* జగన్ ఎఫెక్ట్ తో త్వరపడ్డ కేసీఆర్..
ఏపీలో షూటింగ్ లకు అనుమతులు ఇవ్వడం.. థియేటర్ల ఓపెన్ కు జగన్ సిద్దంగా ఉండడంతో టాలీవుడ్ సినీ పరిశ్రమ ఏపీకి తరలిపోయేందుకు రెడీ అవుతోందన్న వార్తలు సీఎం కేసీఆర్ ను అలెర్ట్ చేశాయి. మంత్రి తలసాని, మంత్రి కేటీఆర్ లు కూడా ఈ విషయంలో రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారని తెలిసింది. దీంతో కేసీఆర్ వెంటనే సినీ పెద్దలతో ఈ సాయంత్రం మీటింగ్ పెట్టారు.

*వరాలు ఇచ్చేందుకు రెడీ
సినీపెద్దల సమస్యలు, వాటికి పరిష్కారాలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ రెడీ అవుతున్నారు. వారి కోరికలు, సమస్యలను తీర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సినిమా షూటింగ్ లు, ప్రోస్ట్ ప్రొడక్షన్ కు కేసీఆర్ అనుమతి ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.ఇక థియేటర్స్ ఓపెనింగ్ పై కూడా కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఈ పరిణామం టాలీవుడ్ సినీ పరిశ్రమకు గొప్ప ఊరటగా చెప్పవచ్చు.

-నరేశ్ ఎన్నం