వారాంతపు ముచ్చట్లు

తెలుగు సమాజం ఎలావుంది?

 

మీడియా లో ఏమి రాయాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో వున్నాయనిపిస్తోంది. ప్రస్తుతం రెండే మార్గాలు ముందున్నాయి. ఒకటి, అందరితో గుడిగుడీగా మంచిగా ఉండాలంటే ఏమీ రాయకుండా మర్యాదపు పలకరింపులు చేసుకుంటూ కాలం గడిపేయటం ; రెండోది, ఎవరేమనుకున్నా పర్వాలేదు , మనసులోని మాట దాచకుండా మాట్లాడటం, రాయటం. మొదటిది ఓ విధంగా ఎటువంటి ఇబ్బందులు లేని కాలక్షేప జీవితం. రెండోది, ఒడిదుడుకులతో కూడుకొని స్నేహాలు, బంధాలు దెబ్బతినే జీవితం. ఇదీ ప్రస్తుతం నా ముందున్నమీమాంస . రాయటమా , మానటమా ? వారాంతపు విశ్రాంతిలో ఈ ప్రశ్న మనసుని కలవరపెడుతుంది.

అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? దీనికి రెండు కారణాలు. ఒకటి చదివే పాఠకులు, వినే శ్రోతలు ఆంధ్ర రాష్ట్రంలో ఏదో ఒకవైపుకు రాజకీయంగా అతుక్కుపోవటం, అదీ రాను రానూ ఈ రాజకీయాల్ని వ్యక్తిజీవితంలో భాగంగా చేసుకోవటం ; రెండోది ఒకనాటిలాగా అన్ని భావాలను, అన్ని ఆలోచనలను స్వీకరించే ఉదార స్వభావం తగ్గిపోవటం. కాబట్టి రచయిత రాసిన విషయాన్ని తన విమర్శనాత్మక ధృక్కోణంగా అనుకోకుండా తన అభిమాన నాయకుడినో , అభిమాన పార్టీనో, అభిమాన సిద్ధాంతాన్నో అవమానించినట్లుగా భావించటం వలన మనసు నొచ్చుకోవటం జరుగుతుంది. అంతటితో ఆగకుండా దాని నుంచి ప్రతిచర్యలు మొదలవుతాయి. కొంతమంది రాసిన వాళ్ళ వ్యక్తిత్వాన్ని రంగుటద్దాల్లోంచి చూడటం, మరికొంతమంది దూరం జరగటం లాంటివి ఈ రియాక్షన్ లో భాగం. నా చిన్నప్పుడు రచ్చబండలపై గంటల తరబడి పెద్ద పెద్దగా అరుచుకున్నా అది ఏరోజూ వ్యక్తిగత సంబంధాలపై ప్రభావం చూపలేదు. ఆయా జ్ఞాపకాలు మధురం. ఇప్పుడు పరిస్థితులు మారాయి. జగన్ ని విమర్శిస్తే కొంతమందికి, చంద్రబాబు నాయుడుని విమర్శిస్తే మరికొంతమందికి, పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే ఇంకొంతమందికి కోపం వస్తుంది. స్పోర్టివ్ గా తీసుకునే పరిస్థితులు తగ్గిపోతున్నాయి. రాజకీయాలంటే పెద్దగా తెలియనివాళ్ళు , పట్టించుకోని వాళ్ళు కూడా ఈ రాజకీయ వ్యాసాలపై ఇదే ధోరణిలో ఆలోచించటం ఎక్కువయ్యింది. అందుకనే జర్నలిజం కూడా సున్నిత అంశంగా మారింది.

అదే జాతీయ స్థాయి లో అయితే సిద్ధాంత రగడ ఆధారంగా ఈ వర్గీకకరణ జరుగుతుంది. ప్రస్తుతమయితే మొత్తం రాజకీయ సమాజం మోడీ అనుకూల, మోడీ వ్యతిరేక గ్రూపులుగా విడిపోయింది. ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. దాన్ని ఎవరూ కాదనలేము. కాకపోతే ఈ వాదనలు సమర్ధించుకోవటానికి ఎవరకి అనుకూలంగావున్న సాక్ష్యాలను వారు ఉదహరిస్తూ వుంటారు. అందులోకూడా పాక్షిక సత్యమే వుంటుంది. ఉదాహరణకు, మహాత్మా గాంధీని , డాక్టర్ అంబేద్కర్ ని ఇరు వర్గాలు విరివిగా కోట్ చేస్తూవుంటారు. వాళ్ళ కొటేషన్లు ఏ సందర్భంలో చెప్పినయ్యో అందులో స్పష్టంగా ఉండదు. వాళ్లిద్దరూ ఇప్పుడు బతికుంటే ఇంత యదేక్షగా వాళ్ళ కొటేషన్లు ఇవ్వటానికి సాహసించేవాళ్ళు కాదు. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే సిద్ధాంతవాదనలు కూడా పాక్షిక సత్యాలే. సిద్ధాంతాల చర్చల్లో ఎక్కువసార్లు సత్యం సమాధిచేయబడుతుంది. అంటే మనం ఈ వాదనలు, సాక్ష్యాలు, కొటేషన్ల నుంచి సత్యం ఎక్కడుందో వెదుక్కోవాల్సివస్తుంది. సత్యం వధ ధర్మం చెర వీటికి లాజికల్ కంక్లూజన్ ?

ఇక టీవీ చర్చలూ, బ్రేక్ వార్తలు చూస్తే బీపీ లేని వాడికి బీపీ వస్తుంది , బీపీ ఉన్నవాడికి హార్ట్ ఎటాక్ వస్తుంది, అదేమీకాకపోతే ప్రశాంతంగా నిద్ర కరువవుతుంది. గత 10 సంవత్సరాల తెలుగు టీవీ వార్తలు చూస్తే ఇదీ పరిస్థితి. మొదటి అయిదు సంవత్సరాలు సమైక్యాంధ్ర , జై తెలంగాణ ; తర్వాత అయిదు సంవత్సరాలు తెలంగాణాలో ప్రశాంతత, ఆంధ్రాలో ప్రత్యేక కేటగిరీ ; మరి ఇప్పుడు ఆంధ్రాలో ఒక రాజధానా , మూడు రాజధానులా . దాదాపు పదకొండు సంవత్సరాలు ఈ గొడవల్లో ప్రజలకేమన్నా ఒరిగిందా? టీవీ లు దీనిపై ఎప్పుడైనా సమీక్షించాయా? సరే ఈ రాజకీయాలు చెత్త అనుకుని వేరే చానళ్ళు పెట్టుకుందామా అంటే అవి ఇంకా దారుణం. ఆ సీరియళ్ళలో ఆడవాళ్లే విలన్లు. కుటుంబ సంబంధాలు ఇంత దారుణంగా ఉంటాయా అని ఎవరికైనా సందేహం వస్తుంది. ఆ దుష్ప్రభావం కుటుంబాలపై కూడా పడుతుంది. ఇదీ సగటు తెలుగువాడి పరిస్థితి. పత్రికలు చూద్దామా అంటే నిష్పక్షపాతంగా రాసే రాతలు తక్కువ. అవి పై రాజకీయనాయకులకు బాకాలుగా తయారయ్యాయి. మరి కింకర్తవ్యం?

ఇంగ్లీష్ పత్రికలు కొంతమేరకు నయం. ఎంతోకొంత లోతైన వ్యాసాలుంటాయి. మరి తెలుగులో ఎందుకు అలా రావు అంటే ఏమో తెలియదు. వెరసి చెప్పొచ్చేదేమిటంటే నా చిన్నప్పటికీ ఇప్పటికీ తెలుగు సమాజంలో ఎన్నో తేడాలు కనబడుతున్నాయి. భావస్వేచ్ఛ , సామాజిక ఆసక్తి, సంస్కరణ దృక్పధం, మానవ సంబంధాలు అప్పుడే బాగున్నాయనిపిస్తోంది. గ్రామాలు కల లాడుతుండేయి. ఇప్పుడు వెలవెలా పోతున్నాయి. అప్పుడు నైతిక విలువలకు పెద్ద పీట వేసేవారు. ఇప్పుడు డబ్బుల విలువలకు పెద్ద పీట వేస్తున్నారు. అయితే ఇన్ని సంవత్సరాల్లో మార్పులేదా అంటే చాలా వుంది. మనిషి జీవితం భౌతికంగా సుఖప్రదమయ్యింది. సాంకేతిక విజ్ఞానం అందుకు దోహదపడింది. మార్పు ని ఎవ్వరూ ఆపలేరు. దానిపని అదిచేసుకుపోతుంది. మనం దానికి అనుగుణంగా ఆలోచనల్లో మార్పులుచేసుకుంటూ పాత కాలపు మంచిని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుదాం.

ఇదీ ఈ వారాంతపు పిచ్చాపాటి , వచ్చేవారం మరికొన్ని

సెలవు

By Ram

Comment here