ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

టీడీపీకి కొరకరాని కొయ్యలా బీజేపీ

The BJP is becoming a rival to the TDP

TDP-BJP

ఏపీ బీజేపీకి కొత్తగా నియమితులైన సోము వీర్రాజు టీడీపీకి అన్నివిధాలా అడ్డుతగులుతున్నట్లు తెలుస్తోంది. అసలు ఆయన నియామకమే టీడీపీకి ఏదో కీడు శంకించినట్లు అయిందట. గతంలో ఉన్న అధ్యక్షుడిని చంద్రబాబు మేనేజ్‌ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. కానీ.. సోము అలా కాదు. అందుకే.. పదవి చేపట్టగానే చంద్రబాబును టార్గెట్‌ చేశారు ఆయన.

గ‌త సార్వత్రిక ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలై దాని నుంచి ఇప్పుడిప్పుడే కోలుకోంటోంది టీడీపీ. అయితే.. ఈ తరుణంలోనే చంద్రబాబుకు ప్రత్యర్థి అయిన వైసీపీకి కంటే బీజేపీ నుంచే తలనొప్పులు వస్తున్నాయట. ఆ పార్టీ నేతలే ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా సోము తెర‌పైకి వ‌చ్చిన త‌ర్వాత ఓ ప‌థ‌కం ప్రకారమే త‌మ‌పై మాన‌సిక దాడి జ‌రుగుతోంద‌ని టీడీపీ భావిస్తోంది.

ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయిన అధికార పక్షాన్ని టార్గెట్‌ చేస్తుంటుంది. కానీ.. ఏపీలో మాత్రం ప్రతిపక్షంలో ఉన్న టీడీపీని మరో ప్రతిపక్ష పార్టీనే టార్గెట్‌ చేసింది. ఏ అంశంలోనైనా వైసీపీతో ముడిపెట్టి టీడీపీని కూడా తిట్టిపోస్తోంది బీజేపీ. చివరకు ఆ ప్రతిపక్ష హోదాను కూడా మిగ‌ల్చకూడ‌ద‌నే అక్కసుతోనే బీజేపీ నేతలు ఇలా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

చంద్రబాబుపై తాజాగా సోము వీర్రాజు మ‌రోసారి ఘాటు విమర్శలు చేశారు. దీనిపై టీడీపీ నేతలు అసంతృప్తిలో ఉన్నారు. తిరుప‌తిలో సోము వీర్రాజు మాట్లాడుతూ.. ప్రతిప‌క్ష నేత చంద్రబాబునాయుడు నాన్ రెసిడెన్షియ‌ల్‌గా నేత‌గా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని ధ్వజ మెత్తారు. ఆయ‌న‌కు ప్రభుత్వం జీతం ఇచ్చే విష‌య‌మై ఆలోచించాల‌ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ పదేళ్లపాటు రెండు రాష్ట్రాలకు రాజధానిగా ఉంటుందని కేంద్రం నిర్ణయించిన‌ప్పటికీ చంద్రబాబు అత్యుత్సాహంతో అమరావతికి బలవంతంగా రాజధానిని తరలించారని అన్నారు. ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత ఏపీని విడిచిపెట్టి హైదరాబాద్‌లో అడ్డా పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు.

Back to top button