తెలంగాణరాజకీయాలు

ఎట్టకేలకు కదిలివచ్చిన తెలంగాణ సర్కార్

The Telangana government has finally moved

ఒక్క భారీ వాన.. ఎంతో మందిని నిరాశ్రయులను చేసింది. ముఖ్యంగా హైదరాబాద్‌ మహానగరాన్ని ముంచెత్తింది. వెయ్యికి పైగా కాలనీలు నీట మునిగాయి. అప్పటి నుంచి బాధితులు నీరు, భోజనం కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అయినా ప్రభుత్వం పక్షాన ఎలాంటి సాయం అందలేదు. మూడునాలుగు రోజులుగా అల్లాడుతున్న బాధితులకు అండగా నిలిచే వారు కరువయ్యారు. రూ.5 వేల కోట్ల వరకు నష్టం జరిగిందని అంచనా వేసిన సీఎం కేసీఆర్‌‌.. సాయం కోసం కేంద్రాన్ని కోరారు. అయితే ఎట్టకేలకు వరద బాధితులను ఆదకునేందుకు ముందుకొచ్చింది రాష్ట్ర సర్కార్‌‌.

Also Read: జనసేనాని.. బయటకు రావాల్సిందేనా?

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌‌ శనివారం ఆయా కాలనీల్లో పర్యటించారు. నగర శివారులోని అలీనగర్‌‌, గగన్‌పహాడ్‌లోని వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. వరదల్లో మృతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌‌ మాట్లాడుతూ.. వరదలతో ప్రాణ నష్టం జరగడం చాలా బాధాకరమన్నారు. ప్రాణనష్టం జరగకుండా అడ్డుకోవాలని ప్రభుత్వం చాలావరకు ప్రయత్నించిందని చెప్పారు.

ఇప్పుడు వర్షాలు తగ్గడంతో ప్రజలకు అవసరమైన రేషన్‌, వైద్య సహాయం అందించే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. పారిశుధ్యంపై ప్రధానంగా దృష్టి సారించాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అవసరమైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం గగన్‌పహాడ్‌ వద్ద అప్ప చెరువును పరిశీలించారు. నీటి పారుదల శాఖతో సమన్వయం చేసుకుంటూ వెంటనే చెరువు కట్టకు మరమ్మతులు చేయాలని సూచించారు. ఆక్రమణలు వెంటనే తొలగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

Also Read: ట్రంప్ కు షాక్: బైడెన్‌ తరఫున ఒబామా ప్రచారం

వరదల వల్ల గగన్‌పహాడ్‌లో బుధవారం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతయ్యారు. వారిలో కరీమా బేగం, అమెర్‌‌ ఖాన్‌, ఎండీ సాహిల్‌ మృతి చెందారు. ఎండీ ఆయాన్‌ ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. అలీనగర్‌‌లో అదే రోజు 8 మంది గల్లంతయ్యారు. వారిలో నలుగురి మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి.

Back to top button