మూవీ రివ్యూః తెల్లవారితే గురువారం
నటీనటులుః శ్రీ సింహ, చిత్ర శుక్ల, మిషా నారంగ్, రాజీవ్ కనకాల, సత్య, అజయ్ తదితరులు
దర్శకత్వంః మణికాంత్ గెల్లి
నిర్మాతలుః రజనీ కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని
సంగీతంః కాల భైరవ
సినిమాటోగ్రఫీః సురేశ్ రగుతు
రిలీజ్ డేట్ః 27 మార్చి, 2021
కథః వీరేంద్ర (శ్రీ సింహ), మధు (మిషా నారంగ్)కు తెల్లవారితే పెళ్లి. కానీ.. వారిద్దరికీ ఆ పెళ్లి ఇష్టం ఉండదు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో పెళ్లి మండపం దగ్గరికి వచ్చినప్పటికీ.. ఆ తర్వాత ఇద్దరూ మండపం నుంచి పారిపోతారు. వీరేంద్ర మరో అమ్మాయిని ప్రేమించిన కారణంగా ఈ పెళ్లి వద్దంటే.. అసలు తనకు పెళ్లిపై సరైన ఒపీనియన్ లేదనే కారణంతో మధు వ్యతిరేకిస్తుంది. మరి, వీరేంద్ర ప్రేమ ఎలా విఫలమైంది? మధుకు పెళ్లంటే ఎందుకు ఇష్టం లేదు? చివరకు వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా? లేదా? అనేది మిగతా కథ.
కథనంః పెళ్లి మండపం నుంచి పారిపోయిన వీరేంద్ర తన ఫ్లాష్ బ్యాక్ చెప్పడం మొదలు పెడతాడు. కానీ.. ఆ కథలో సరైన వేగం కనిపించదు. అంతేకాకుండా.. ఎక్కడా ట్విస్టులు లేకుండా అలా సాగిపోతూ ఉంటుంది. ఇక, సన్నివేశాల్లో చాలా వరకు ఎక్కడో చూసినట్టుగానే అనిపిస్తాయి. లవ్ స్టోరీకి కావాల్సిన ఫీల్ పెద్దగా కనిపించదు. ఆ తర్వాత తనకు పెళ్లంటే ఎందుకు ఇష్టం లేదో చెబుతుంది మధు. అయితే.. పెళ్లిపై వ్యతిరేకత కలగడానికి చెప్పే రీజన్స్ అంత కన్విన్సింగ్ గా అనిపించవు. కథను ఎలివేట్ చేయడానికి కావాల్సిన బలం మిస్సైనట్టు అనిపిస్తుంది. అదే సమయంలో వీరేంద్రను వదులుకోవడానికి చూపించే కారణాలు కూడా అంతగా అంగీకరించేలా ఉండవు. ఇక విజయ్ తో ప్లాన్ చేసిన ఎపిసోడ్లు కూడా ఇంట్రస్టింగ్ గా అనిపించవు. మొత్తంగా దర్శకుడు పేపరుపై కథను ఎలా సిద్ధం చేసుకున్నాడో తెలియదుగానీ.. తెరపైకి వచ్చేసరికి ఆ బిగి కొరవడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
పెర్ఫార్మెన్స్ః కథ, కథనాన్ని పక్కనపెడితే హీరో శ్రీసింహ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. తన పాత్రకు న్యాయం చేశాడు. స్క్రిప్టు మరింత బలంగా ఉండి ఉంటే.. తప్పకుండా అతని నటనకు ప్రశంసలు దక్కేవి. పలు సన్నివేశాల్లో ఆయన నటనలో పరిణతి కనిపిస్తుంది. మిషా నారంగ్, చిత్రా శుక్ల తమ పాత్రల పరిధిమేర నటించారు. వారి నటనను ఎలివేట్ చేసే సన్నివేశాలు లేకపోవడమే మైనస్. సత్య, వైవాహ హర్ష కామెడీ బాగా పండించారు.
ప్రేమ కథా చిత్రాలంటే.. ఇద్దరి మధ్య ఉన్న లవ్ ఎంత బలమైనదో చాటిచెప్పే సన్నివేశాలు ఉండాలి. అదే సమయంలో వారు విడిపోవాల్సి వస్తే.. ఎలాంటి పరిస్థితులు కారణమయ్యాయో బలంగా వివరించాలి. ఈ సినిమాలో ఇవి రెండూ కొరవడినట్టుగా కనిపిస్తుంది. శుక్రవారం రెండు కాస్త పెద్ద సినిమాలే కాబట్టి.. మార్కెటింగ్ స్ట్రాటజీతో సోలోగా శనివారం వచ్చిందీ మూవీ. ముందు ఆదివారం ఉంది. వీకెండ్ కు కలెక్షన్లు పర్వాలేదనిపించొచ్చు. సోమవారం ఎలా నిలబడుతుందనే విషయంపైనే సినిమా లైఫ్ ఆధారపడి ఉంది.
బలాలుః శ్రీ సింహ నటన, కామెడీ, కొన్ని సన్నివేశాలు
బలహీనతః కథ, కథనం, రొటీన్ సన్నివేశాలు
లాస్ట్ లైన్ః ముందుంది సోమవారం
రేటింగ్ః 2