ఆంధ్రప్రదేశ్రాజకీయాలుసంపాదకీయం

‘తిరుప‌తి’లో దొంగలు ప‌డ్డారు!

‘‘తిరుపతి ఉప ఎన్నిక‌లో వైఎస్సార్సీపీ 5 ల‌క్ష‌ల మెజా‌రిటీతో విజ‌యం సాధిస్తుంది..’’ ఇదీ.. ఆ పార్టీ నేత‌లు మొదట్నుంచీ చెబుతూ వ‌స్తున్న మాట‌. కానీ.. ప్ర‌చారం ముగిసి, పోలింగ్ రోజు నాటికి మొత్తం త‌ల‌కిందులైంద‌ని స‌మాచారం. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన అధికార పార్టీ నాయ‌కులు.. దొంగ ఓట్లు వేయించేందుకు ముందు రోజు రాత్రి నుంచే ప్ర‌య‌త్నాలు చేప‌ట్టిన‌ట్టు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ విష‌యం తెల్ల‌వారిన త‌ర్వాత తిరుప‌తి ప్ర‌జానీకానికి తెలిసి వ‌చ్చింద‌ని అంటున్నాయి.

ఓటు వేయ‌డానికి లైన్లో ఉన్న‌వారిని స్వ‌యంగా విప‌క్షాల అభ్య‌ర్థులు ప్ర‌శ్నించ‌గా.. దొంగ ఓటు వేయ‌డానికి వ‌చ్చిన‌ట్టు తేలింద‌ని అంటున్నారు. చివ‌రికి బీజేపీ ఏజెంట్ ఓటును కూడా ఎవ‌రో వేయ‌డ‌నికి వ‌చ్చిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. తిరుప‌తి పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గ స‌మీప ప్రాంతాల‌కు చెందిన వారిని దొంగ ఓట్లు వేయ‌డానికి త‌ర‌లించార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ విష‌యాన్ని గుర్తించేలోపు చాలా దొంగ ఓట్లు పోల‌య్యాయ‌ని విప‌క్షాల నేతలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప‌లువురు దొంగ ఓట‌ర్ల‌ను ప‌ట్టుకుని, పోలీసుల‌కు అప్ప‌గించిన‌ప్ప‌టికీ.. వారు ప‌ట్టించుకోలేద‌ని ఆరోపిస్తున్నాయి విప‌క్షాలు. ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు కూడా అందుబాటులో లేర‌ని అంటున్నారు. తిరుప‌తిలో మాత్ర‌మే కాకుండా.. నెల్లూరు జిల్లాలోని నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని అంటున్నారు. మొత్తం తిరుప‌తి పార్ల‌మెంటు ప‌రిధిలోని అన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో దొంగ ఓట్ల హ‌వా కొన‌సాగుతోంద‌నే విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

వ్య‌వ‌స్థ‌ల‌న్నీ అధికార పార్టీకి వ‌త్తాసు ప‌లుకుతున్నాయ‌ని విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. దొంగ ఓట‌ర్ల‌ను చూసీ చూడ‌న‌ట్టు వ‌దిలేస్తున్నార‌ని బీజేపీ అభ్య‌ర్థితోపాటు కాంగ్రెస్ కూడా ఆరోపించ‌డం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు బీజేపీ అభ్య‌ర్థి ర‌త్న‌ప్ర‌భ పోలీస్ స్టేష‌న్ ఎదుట ధ‌ర్నా కూడా చేప‌ట్టిన‌ట్టు స‌మాచారం. ఈ ఎన్నిక‌ను ర‌ద్దు చేయాల‌ని, మ‌ళ్లీ ఎన్నిక నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.

అయితే.. అధికార వైసీపీ మాత్రం.. వారు దొంగ ఓట‌ర్లు కాద‌ని, వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకోవ‌డానికి వ‌చ్చిన భ‌క్తుల‌ని వాదిస్తున్న‌ట్టు స‌మాచారం. వీరంద‌రినీ ప్రైవేటు బ‌స్సుల్లో తీసుకొచ్చి, ప‌లు క‌ల్యాణ మండ‌పాల్లో ఉంచిన‌ట్టుగా విప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. వేలాదిగా మ‌నుషుల‌ను దింపి, దొంగ ఓట్లు వేయిస్తున్నా.. అధికారులు ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని అంటున్నాయి. ప్ర‌జ‌లు మొత్తం గ‌మ‌నిస్తున్నార‌ని, త‌ప్ప‌క బుద్ధి చెబుతార‌ని హెచ్చ‌రిస్తున్నాయి.

Back to top button