జాతీయంరాజకీయాలు

థర్డ్ ఫ్రంట్ అంతా వట్టిదే?

third front antha vattide

బీజేపీని ఎదుర్కొనే శక్తి ప్రస్తుతానికి ఎవరికి లేదు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో ఆపసోపాలు పడుతోంది. ఈ నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్ గురించి ఆలోచన అయితే వచ్చింది కానీ ఆచరణ సాధ్యం కావడం లేదు. బీజేపీని ఎదుర్కొనేందుకు ఎన్సీపీ అధినేత శరత్ పవార్ ప్రతిపక్షాలతో సమావేశం నిర్వహిస్తారని వచ్చిన వార్తలు ఊహాగానాలే అని తేలిపోయింది.

దేశంలోనే ప్రధాన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల ముంబై వెళ్లి శరత్ పవార్ తో భేటీ అయి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించారని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై శరత్ పవార్ క్లారిటీ ఇచ్చారు. దేశంలోని అన్ని పార్టీలను ఏకం చేయాలన్న ప్రచారం సాగినా అది ఇప్పట్లో సాధ్యం కాదని తేలిపోయింది.

తాము తృతీయ ఫ్రంట్ కోసం మీటింగ్ ఏర్పాటు చేయలేదని, ప్రస్తుత పరిణామాలపై చర్చించేందుకే నిర్వహిస్తున్నామని శరత్ పవార్ చెప్పారు. ఈ సమావేశంలో రాజకీయ నేతలు,మేధావులు, సినీ ప్రముఖులు, మీడియా వ్యక్తులు పాల్గొంటారని పేర్కొన్నారు.2018లో తాను ఏర్పాటు చేసిన పొలిటికల్ యాక్షన్ గ్రూప్ రాష్ర్ట మంచ్ సమావేశాన్ని నిర్వహించినట్లు బీజేపీ మాజీ నేత, తృణమూల్ కాంగ్రెస్ నేత యశ్వంత్ సిన్హా తెలిపారు.

2024 ఎన్నికల్లో ప్రధాని మోడీని ఎదుర్కోవడానికి తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఈ సమావేశానికి సంబంధం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో తృతీయ ఫ్రంట్ వ్యవహారం వట్టి గాలిబుడగ అని తేలిపోయింది. దేశంలోనే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ థర్డ్ ఫ్రంట్ అనేది వర్కవుట్ కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏర్పడే ఫ్రంట్ లతో బీజేపీ ప్రభుత్వానికి ఇబ్బందేమీ లేదన్నారు.

Back to top button