ఆంధ్రప్రదేశ్తెలంగాణరాజకీయాలుసంపాదకీయం

KCR,JAGAN: కేసీఆర్, జగన్ లలో ఎవరికి లాభం?

TS CM KCR, AP CM Jagan

కష్టపడకుండా వచ్చిందేదీ నిలవదు.. ఓ సినిమాలో రజనీకాంత్ చెప్పే మాటలు. ఇది అక్షరాలా నిజమే. మన ప్రభుత్వాలు చేస్తున్న చర్యలు కూడా ఇదే విధంగా ఉంటున్నాయి. ప్రజలను సోమరులను చేసే విధంగా పథకాలు తెచ్చి వారిలో పనిచేసే ఆలోచనను నిర్మూలిస్తున్నారనే అపవాదు మూటగట్టుకుంటున్నారు. సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు ఇస్తూ వారిలో అప్పనంగా వచ్చే వాటిపై ఆధారపడేలా చేస్తున్నారు. పాలకుల ఆలోచనలతో ప్రజలను నిరంతరం దారుణంగా బద్దకస్తులను చేయడానికే కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే కాలంలో యువత కూడా పని చేసేందుకు ముందుకు రాక ఇంట్లోనే కూర్చునేలా తయారయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

తెలుగు స్టేట్ల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తున్నారు. రూ. లక్షల కోట్ల మేర ప్రజల ఖాతాలకు మళ్లించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే తంతు కొనసాగితే భవిష్యత్తు అంతా బద్దకస్తులే కనిపించే ప్రమాదం కనిపిస్తోంది. ప్రజల ఖాతాలకు కష్టపడకుండా డబ్బులు వస్తుంటే ఇక ఎందుకు పని చేస్తారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఏ పని చేయకుండానే డబ్బులు ఖాతాల్లో పడడంతో పని చేసే ధ్యాస కూడా తగ్గిపోతోంది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థలు కుదేలైపోయే అవకాశం ఉంది. అయినా ప్రభుత్వాలు తమ పని తాము కానిస్తున్నాయి.

గతంలో ఎన్నడు లేని విధంగా ప్రభుత్వాలు డబ్బుల పంపిణీపై దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే లక్ష కోట్ల వరకు ప్రజల ఖాతాలకు మళ్లించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా దళితబంధు పథకంతో లక్ష కోట్లు ప్రజలకు ఇస్తామని చెప్పడంతో అందరిలో అయోమయం నెలకొంది. ఇంత దారుణంగా డబ్బులు ఇచ్చే ప్రక్రియ ఎంతవరకు సమంజసమని అందరు ప్రశ్నిస్తున్నారు.

సంక్షేమ పథకాలంటే ప్రజలకు ఉపాధి కల్పించేవి ఉండాలి. కానీ ప్రస్తుతం ప్రజలకు మన పాలకులు నేరుగా డబ్బులు ఇస్తుండడంతో అవి సజావుగా వినియోగం అయ్యే సందర్భాలు కనిపించడం లేదు. డబ్బులున్నాయంటే వేటికో ఖర్చు చేసి వారు ఉపాధి మార్గాలపై దృష్టి పెట్టే వీలు కనిపించడం లేదు. ఇాలా అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వాలు చేసే పథకాల వల్ల ప్రజల్లో అత్యాశలకు వారిని సిద్ధం చేసినట్లుగా ఉంటోంది. కానీ వారిని పనిమంతులుగా చేసే క్రమం మాత్రం కనిపించడం లేదు.

జగన్ ఏపీలో అమ్మఒడి, వాహనమిత్ర, రైతు భరోసా, వైఎస్సార్ ఆసరా వంటి పథకాలతో వేల కోట్ల రూపాయలు ప్రజల ఖాతాలకు మళ్లించే కార్యక్రమాలు చేపట్టారు. కరోనా సమయంలో కూడా జగన్ సంక్షేమ పథకాలకే ప్రాధాన్యత ఇచ్చారనే విమర్శలు సైతం ఉన్నాయి. దీంతో సంక్షేమ పథకాలనే నమ్ముకున్న పాలకుల భవిష్యత్ ఏమిటో ఇప్పుడే ఏం చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లక్షల కోట్లతో ప్రజల జేబులు నింపుతున్నారు తప్ప అభివృద్ధి పై పట్టించుకోవడం లేదనే విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.

ఇన్నాళ్లు అభివృద్ధి బాట పట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ప్రస్తుతం సంక్షేమ పథకాల బాట పట్టారు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయమే ఉండడంతో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలనే తాపత్రయంతో దళితబంధు పథకం పేరుతో లక్ష కోట్లు కుమ్మరించేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. హుజురాబాద్ పైలెట్ ప్రాజెక్టుగా రాష్ర్టమంతా పంచేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. దీనికోసం ఆదాయం కావాలని భావించి ప్రభుత్వ భూములను సైతం అమ్మేందుకు సిద్ధమవుతున్నారు.

తెలంగాణలో భూముల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయంతో, ఏపీలో అప్పులు చేయడం ద్వారా వచ్చే ఆదాయంతో కులాల వారీగా డబ్బుల పంపిణీ కోసం రెండు స్టేట్ల సీఎంలు వెంపర్లాడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ముఖ్యమంత్రులపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో రెండు ప్రాంతాల పరిస్థితి అధ్వానంగా మారింది. ఈ నేపథ్యంలో తెలుగు ప్రాంతాల్లో సీఎంల కుతంత్రాలు ఏమేరకు ప్రజల మన్ననలు పొందుతాయో వేచి చూడాల్సిందే.

Back to top button