ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

చురుగ్గా సాగుతున్న తిరుపతి పోలింగ్‌


పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పోలింగ్‌ ఇప్పటికే ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ నిదానంగా నడుస్తోంది. చిత్తూరు జిల్లాలో మూడు, నెల్లూరు జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. మొత్తం 2,470 సెంటర్లను పెట్టారు. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం 17,10,699 మంది ఓటర్లు ఉన్నారు.

కోవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూనే కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశారు. మొత్తం 877 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. 1241 కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌, 475 కేంద్రాల్లో వీడియో చిత్రీకరణ చేస్తున్నారు. ముగ్గురు సీనియర్‌‌ ఆఫీసర్లు, 816 మంది మైక్రో అబ్జర్వర్లు ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. 716 మందితో కూడిన 8 కంపెనీల కేంద్ర బలగాలు విధుల్లో ఉన్నాయి. కాగా.. ఈ స్థానం నుంచి 28 మంది బరిలో నిలిచారు.

ఉదయం కొంచెం చెప్పుకునే స్థాయిలో పోలింగ్‌ జరిగినా.. మధ్యాహ్నం ఎండల నేపథ్యంలో తగ్గుతోంది. మధ్యాహ్నం అయితే.. ఎండలు పెరుగుతాయని ఉదయం పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి, తన కుటుంబసభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు.

మరోవైపు.. ఈ ఉప ఎన్నికను అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా ఈ సీటును గెలిచి తీరాలని ఆరాటపడుతున్నాయి. ఇందుకోసం ప్రచారంలో తీవ్ర స్థాయిలో శ్రమించాయి. అన్ని పార్టీల నుంచి మహామహులు ప్రచారం చేశారు. ఈ స్థానాన్ని గెలుచుకొని వైసీపీ షాక్‌ ఇవ్వాలని టీడీపీ ఉబలాటపడుతోంది. ఇక బీజేపీ–జనసేన సైతం ఈ సీటు గెలవడమా..? లేక రెండో ప్లేస్‌లో అయినా నిలవడమా అన్నట్లుగా పోరాడింది.

దీనికితోడు అధికార వైసీపీ మాత్రం ఎంతవరకు భారీ మెజార్టీ పైనే దృష్టి సారించింది. ఒకవేళ ఈ ఎన్నికల్లో 70 శాతానికి పైగా పోలింగ్‌ శాతం నమోదైతే వైసీపీకి తిరుగులేదని ఎనాలసిస్టులు అంటున్నారు. తొలిసారిగా ఈసారి 80 ఏళ్లు పైబడిన వారు పోలింగ్‌ కేంద్రానికి వచ్చి ఓటు వేయనక్కర్లేకుండా పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించారు. మరోవైపు.. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారంతా సాయంత్రం 6 గంటల తర్వాత వచ్చి ఓటు వేయనున్నారు. మొత్తంగా సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.

Back to top button