అంతర్జాతీయంరాజకీయాలు

Afghanistan: అప్ఘనిస్తాన్ అధ్యక్షుడు ఏ దేశానికి పారిపోయాడు?

To which country did the President of Afghanistan flee?

రక్తపాతం లేకుండా అప్ఘనిస్తాన్ తాలిబన్ల వశమైంది. అప్ఘనిస్తాన్ ప్రభుత్వం సైన్యం చేతులెత్తిన వేళ ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కూడా ఏం చేయలేకపోయాడు. అందుకే రాజ్యాధికారాన్ని త్యజించాడు. రక్తపాతం లేకుండా తాలిబన్లకు అధికారం అప్పగించి దేశం విడిచి పారిపోయాడు.

తాజాగా ఫేస్ బుక్ లో అప్ఘనిస్తాన్ అధ్యక్షుడు ఆ దేశ ప్రజలకు సందేశాన్ని పంపించాడు. అప్ఘనిస్తాన్ గడ్డపై రక్తపాతాన్ని నివారించడానికే తాను దేశం విడిచి వెళ్లాల్సి వచ్చిందని అష్రాఫ్ ఘనీ ప్రకటించారు. తాను ఇంకా ప్రతిఘటించి ఉంటే అనేక మంది దేశభక్తులు ప్రాణత్యాగం చేయాల్సి వచ్చేదని వ్యాఖ్యానించారు. పరోక్షంగా తాలిబన్ల విజయాన్ని అంగీకరించారు. దేశ రక్షణ బాధ్యత తాలిబన్లదేనని ప్రకటించారు.

గత 20 ఏళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన నా దేశాన్ని వీడడం.. లేక తాలిబన్లతో పోరాడడం అనే రెండే ప్రత్యామ్మాయాలు నాకు ఉన్నాయని.. అనేకమంది ప్రజలు అమరులవ్వడం.. కాబుల్ నగరం విధ్వంసం కావడం.. ఈ పరిణామాలు అతిపెద్ద మానవ సంక్షోభాన్ని మిగులుస్తాయని అందుకే ఇవన్నీ తప్పించడానికే తాను దేశం విడిచి వెళ్లాలని నిర్ణయించుకున్నానని ఫేస్ బుక్ సందేశంలో పేర్కొన్నారు.

అప్ఘన్ రాజధాని కాబూల్ లోకి నిన్ననే తాలిబన్లు వచ్చారు. అన్ని వైపుల నుంచి చుట్టుముట్టారు. అయితే తమ సహజ స్వభావానికి విరుద్ధంగా కాల్పులు జరపకుండా శాంతిమంత్రం జపించారు. విధ్వంసానికి దిగలేదు. దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ వద్దకు తమ రాయబారులను తాలిబన్లు పంపించారు. ప్రభుత్వం తరుఫున మాజీ అధ్యక్షుడు కర్జాయ్ వారితో చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం దేశ అధ్యక్ష భవనంలోకి తాలిబన్లు ప్రవేశించారు. ఆ వెంటనే అష్రాఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారు.

అప్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తొలుత తజికిస్తాన్ కు వెళ్లిపోయినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఘనీ, ఆయన భార్య, చీఫ్ అఫ్ స్టాఫ్, దేశ భద్రతా సలహాదారు ఉజ్బెకిస్తాన్ లోని తాష్కెంట్ కు పారిపోయారని మీడియా కథనాలు చెబుతున్నాయి. మొత్తంగా రక్తపాతాన్ని నివారించడానికి.. చేతులెత్తేసిన అప్ఘన్ సైన్యం ను చూసి అధ్యక్షుడే పారిపోయిన దైన్యం అప్ఘనిస్తాన్ ప్రజల్లో తీవ్ర ఆవేదనను మిగిల్చింది.

Back to top button