టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

tollywood : చిరు ఇంట్లో టాలీవుడ్ భేటీ.. జగన్ తో ఎజెండాపై చర్చ.. మరి వాళ్లేరీ?

క‌రోనా మహమ్మారితో సినీ రంగం ఎన్ని అవస్థలు ప‌డుతోందో తెలిసిందే. దీనికి తోడు ఏపీలో ఉన్న అన‌నుకూల ప‌రిస్థితులు కూడా ఇండ‌స్ట్రీకి శాపంగా మారాయి. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ప్ర‌స్తుతం మూడు షోల‌కే అనుమ‌తి ఉంది. నైట్ షో ర‌ద్దు చేశారు. అందులోనూ.. 50 శాతం ఆక్యుపెన్సీ మాత్ర‌మే అమ‌ల్లో ఉంది. మ‌రో అతిపెద్ద స‌మ‌స్య టిక్కెట్ రేట్ల త‌గ్గింపు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ‘వ‌కీల్ సాబ్’ సినిమా స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి రేట్లు త‌గ్గించిన సంగ‌తి తెలిసిందే. పదేళ్ల కిందటి టికెట్ రేట్లనే అమలు చేయాలంటూ జీవో ఇచ్చింది ప్రభుత్వం.

ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏపీ సీఎం జ‌గ‌న్ తో సినీ పెద్ద‌లు స‌మావేశం కాబోతున్నారు. చ‌ర్చ‌ల‌కు రావాలంటూ ప్ర‌భుత్వం నుంచి ఆహ్వానం వచ్చింది. మంత్రి పేర్ని నాని స్వ‌యంగా చిరంజీవికి ఫోన్ చేసి.. ముఖ్య‌మంత్రితో స‌మావేశ‌మై స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకోవాల‌ని సూచించారు. దీంతో.. త్వ‌ర‌లో ఈ భేటీ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో.. మెగాస్టార్ చిరంజీవి సినీ పెద్ద‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. చిరు నివాసంలో జ‌రిగిన భేటీలో నాగార్జున‌, సురేష్ బాబు, అల్లు అర‌వింద్‌, దిల్ రాజు, సి.క‌ల్యాణ్‌, నారాయ‌ణ‌మూర్తి త‌దిత‌రులు పాల్గొన్నారు. ముఖ్య‌మంత్రితో ఏయే అంశాల‌పై చ‌ర్చించాల‌నే విష‌య‌మై వీరు మాట్లాడుకున్నారు.

ప్ర‌ధానంగా.. థియేట‌ర్ల‌ విద్యుత్ బిల్లుల నుంచి మిన‌హాయింపులు పొందే అంశాన్ని ప్ర‌స్తావించాల‌ని నిర్ణ‌యించారు. అదేవిధంగా.. బీ, సీ సెంట‌ర్ల‌లో టిక్కెట్ రేట్ల పెంపు అంశంపైనా ప్ర‌భుత్వంతో చ‌ర్చించాల‌ని డిసైడ్ చేశారు. అదేవిధంగా.. సినీ కార్మికుల స‌మ‌స్య‌ల‌ను సైతం సీఎం దృష్టికి తీసుకెళ్లి.. వారికి మేలు చేకూర్చే నిర్ణ‌యాలు తీసుకునేలా చూడాల‌ని నిర్ణ‌యించారు.

దీంతోపాటు.. విశాఖ కేంద్రంగా సినీ ప‌రిశ్ర‌మ‌ను విస్త‌రించే అవ‌కాశాల గురించి సీఎంతో చ‌ర్చించ‌నున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌భుత్వం ప్రోత్సాహ‌కాలు ఇస్తే.. విశాఖలో సినీ ఇండ‌స్ట్రీ విస్త‌రించే అవ‌కాశం ఉంద‌నే విష‌యాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాల‌ని స‌మావేశంలో నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. కాగా.. సీఎం జగ‌న్ తో మీటింగ్ ఈ వారంలోనే ఉంటుంద‌ని తెలుస్తోంది. జ‌గ‌న్ కు అవ‌కాశం ఉంటే.. ఈ నెల 18 లేదా 19 తేదీల్లో అపాయింట్ మెంట్ ఖ‌రారు చేయాల‌ని చిరంజీవి కోరిన‌ట్టుగా తెలుస్తోంది.

ఇదిలాఉంటే.. ఈ భేటీలో బాల‌కృష్ణ‌, మోహ‌న్ బాబు లాంటి వారులేరు. గ‌తంలో జ‌గ‌న్ తో జ‌రిగిన‌ మీటింగ్ సంద‌ర్భంగా బాల‌య్య ప‌లు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు కూడా బాల‌య్య‌, మోహ‌న్ బాబు చిరు భేటీలో పాల్గొన‌లేదు. మ‌రి, వారిని పిలవ‌లేదా? పిలిచినా రాలేదా? అన్న సంగతి మాత్రం తెలియదు. జగన్ తో భేటీ తర్వాతనే ఏం జరిగిందనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Back to top button