తెలంగాణరాజకీయాలు

హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈయనే?

Srinivas Yadavహుజురాబాద్ ఉప ఎన్నికపై పార్టీలు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. విజయమే లక్ష్యంగా ముందుకు కదులుతున్నాయి. ఇప్పటికే బీజేపీ ముందు వరుసలో ఉండగా అధికార పార్టీ టీఆర్ఎస్ మాత్రం ఇంతవరకు అభ్యర్థి ని ప్రకటించలేదు. దీంతో ప్రచారం చేయడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. దీన్ని గ్రహించిన అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. బీజేపీని ఎదుర్కొనే క్రమంలో అభ్యర్థి ఎంపికపై దృష్టి సారించింది.

హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అధిష్టానం ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 16న దళితబంధు ప్రారంభోత్సవంలో కేసీఆర్ ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తారని ప్రచారం సాగుతోంది. విద్యార్థినేతగా గుర్తింపు పొందిన శ్రీనివాస్ యాదవ్ వీణవంక గ్రామానికి చెందిన వాడు. ఈటల మాదిరిగానే గెల్లు శ్రీనివాస్ యాదవ్ బీసీ కావడంతోనే ఆయన వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం.

టీఆర్ఎస్ నుంచి పోటీకి చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఎల్. రమణ, వకుళాభరణం కృష్ణమోహన రావు పేర్లు ప్రచారంలో ఉన్నా గెల్లు శ్రీనివాస్ యాదవ్ కే సీటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈటల ఉద్యమ నాయకుడిగా గుర్తింపు ఉండడంతో ఆయనపై పోటీ చేసే వారు కూడా ఉద్యమ నాయకుడే ఉండాలని భావించి శ్రీనివాస్ యాదవ్ పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ యాదవ్ ఉద్యమ సమయంలో అనేక సార్లు జైలుకు వెళ్లిన సందర్భాలు సైతం ఉన్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్వీ రాష్ర్ట అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

గెల్లు శ్రీనివాస్ యాదవ్ సీఎం కేసీఆర్ కు సన్నిహితుడిగా ఉన్నారు. మరోవైపు సమీకరణలు కూడా కలిసి రావడంతో శ్రీనివాస్ యాదవ్ అదృష్టం కలిసొచ్చినట్లు చెబుతున్నారు. ఈనెల 16న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా రాకున్నా ఆయన అభ్యర్థిత్వంపై కేసీఆర్ ప్రకటన చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పదవులు ఆశించిన వారిని బుజ్జగించే పనిలో నాయకులు పడిపోయారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక పోరు రసవత్తరంగా మారనుంది.

Back to top button