తెలంగాణరాజకీయాలు

ఆర్ఎస్ ప్రవీణ్ పై టీఆర్ఎస్ దాడి మొదలెట్టిందా?

TRS Targeting RS Praveen Kumar
ఏరు దాటే దాకా ఓడ మల్లయ్య.. ఏరు దాటాక బోడ మల్లయ్య అనేది సామెత. ఇప్పుడు మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ వ్యవహార శైలికి ఇది ప్రత్యేక నిదర్శనంగా నిలుస్తోంది. ప్రవీణ్ కుమార్ ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీలో చేరారు. దీంతో ఇటీవల నల్గొండలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన టీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడాన్ని టీఆర్ఎస్ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇన్నాళ్లు గురుకులాల కార్యదర్శిగా ఉండగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై పాజిటివ్ గా మాట్లాడిన ప్రవీణ్ కుమార్ ఒక్కసారిగా ప్రభుత్వంపై విమర్శలు చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, భాస్కర్ రావు మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు గతంలో సీఎం కేసీఆర్ దేవుడులా కనిపించి ఇప్పుడు ఎందుకు దెయ్యం లా కనిపిస్తున్నారని ప్రశ్నించారు. బీఎస్సీలో చేరి బీజేపీకి తొత్తుగా మారారని దుయ్యబట్టారు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ ఆయన చేసిన దూషణలపై ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. ప్రవీణ్ కుమార్ మనస్సాక్షితో చూడాలని హితవు పలికారు.

అయితే రాజకీయాల్లో విమర్శలు మామూలే కానీ ఇన్నాళ్లు ప్రభుత్వంలో పనిచేసి ఇప్పుడు సీఎంనే విమర్శించడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ పై పదే పదే విమర్శలు చేయడంపై ఆక్షేపణ చేశారు. ప్రభుత్వ విధానాలను పాటించిన అధికారిగా పనిచేసిన ప్రవీణ్ కుమార్ కు ఇప్పుడు అవి ఎందుకు నచ్చడం లేదని అడుగుతున్నారు. ప్రవీణ్ కుమార్ అంతర్మథనం చేసుకోవాలని సూచించారు.

గతంలో గురుకులాల కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ కుమార్ తన పదవీకాలాన్ని సీఎం దగ్గర విన్నవించుకుని పొడిగింపు చేసుకున్నారని గుర్తు చేశారు. తాను ఎస్సీ, స్కూళ్లు సంక్షేమం కోసం పని చేస్తానని చెప్పడంతో కేసీఆర్ సైతం ఆయన రిక్వెస్ట్ ను ఆమోదించి సుదీర్ఘ కాలం ఆయన పదవిలో కొనసాగేందుకు ఒప్పుకున్నారని గుర్తు చేశారు. అలాంటి నేతపై ప్రవీణ్ కుమార్ లేనిపోని ఆరోపణలు చేయడంపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to top button