అత్యంత ప్రజాదరణజీహెచ్‌ఎంసీ ఎన్నికలుతెలంగాణరాజకీయాలు

ఎంఐఎం, కేసీఆర్ రహస్య దోస్తీని కడిగేసిన అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హైదరాబాద్ లో ర్యాలీ తీసిన అనంతరం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వరదలు వచ్చినప్పుడు రూపాయి ఇవ్వలేదన్న కేసీఆర్ మాటలను తిప్పి కొట్టారు. వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ కు రెండు విడతల్లో సుమారు రూ.500 కోట్ల నిధులిచ్చామని.. పేదలకు ఇళ్లు కట్టేందుకు వేల కోట్లు ఇచ్చామని తెలిపారు. కేసీఆర్ చెప్తున్నవని అబద్ధాలన్నారు. ఎంఐఎంతో టీఆర్ఎస్ రహస్య ఒప్పందం ఎందుకు? బహిరంగంగానే పొత్తు పెట్టుకోవచ్చు కదా అని విమర్శించారు.

Also Read: కవితకు గట్టి కౌంటర్ ఇచ్చిన బండ్ల గణేష్

కేసీఆర్ పాలనా వైఫల్యాలను అమిత్ షా కడిగిపారేశారు. వంద రోజుల్లో అభివృద్ధి అనే నినాదం కేసీఆర్ ఇచ్చి ఐదేళ్లు అయిందని అన్నారు. హుస్సేన్ సాగర్ ను శుద్ధి చేస్తామన్నారు… అదేమైంది? గాంధీ, ఉస్మానియా తరహాలో నాలుగు ఆసుపత్రులన్నారు… అవేమయ్యాయి? అని అమిత్ షా నిలదీశారు. తాను అడిగే ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం చెబుతారనే ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు.

సీఎం కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు రావాలని అమిత్ షా వ్యాఖ్యానించారు. రోడ్ షోలో తనకు స్వాగతం పలికిన హైదరాబాద్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సీట్లు పెంచుకోవడానికి ఎన్నికల్లో పోటీచేయడం లేదని.. మేయర్ సీటు గెలుచుకోవడానికే పోటీచేస్తున్నామన్నారు. బీజేపీ అభ్యర్థే మేయర్ అవుతాడన్నారు.

మోదీకి ప్రజాదరణ వస్తుందనే ఆయుష్మాన్ భారత్ ను తెలంగాణ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేసీఆర్‌ ఎప్పుడైనా సచివాలయానికి వెళ్తే కదా కేంద్రం ఇచ్చే నిధుల గురించి తెలిసేది! నగర అభివృద్ధికి రెండు విడతల్లో సుమారు రూ.500కోట్ల నిధులిచ్చాం. పేదల ఇళ్లు కట్టేందుకు కేంద్రం రూ.వేల కోట్లు ఇస్తోంది. వీధి వ్యాపారుల పథకాన్ని తెరాస ప్రభుత్వం అమలు చేయడం లేదు. రాష్ట్రంలో కుటుంబపాలన నడుస్తోంది. టీఆర్ఎస్ రాజకీయాల వల్లే పేదలకు సరైన వైద్యం అందడం లేదని తెలిపారు. ఎంఐఎం కనుసన్నల్లోనే టీఆర్ఎస్ నడుస్తోందని అమిత్ షా పేర్కొన్నారు. హైదరాబాద్ కు నిజాం సంస్కృతి నుంచి విముక్తి కలిగిస్తామని అన్నారు.

Also Read: గ్రేటర్ లో పవన్ అందుకే ప్రచారం చేయలేదా?

జాతీయ నాయకులు హైదరాబాద్ కు వరదలా వస్తున్నారంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని.. మరి హైదరాబాద్ నగరంలో వరదలు వచ్చి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కేసీఆర్, ఓవైసీపీ ఎందుకు రాలేదని అమిత్ షా ప్రశ్నించారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇస్తే నాలాలపై అక్రమణ నిర్మాణాలను తొలగించి చూపిస్తామని స్పష్టం చేశారు. మంచి పరిపాలన అందిస్తామని నగర ప్రజలకు వాగ్దానం చేస్తున్నామని చెప్పారు. మేం మాటిచ్చామంటే అమలు చేసి తీరుతాం అని అమిత్ షా ఉద్ఘాటించారు. టీఆర్ఎస్ గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు.

హైదరాబాద్ లో ఎంఐఎం ఎన్నో అక్రమ కట్టడాలను నిర్మించిందని.. అక్రమ కట్టడాల వల్లే కేసీఆర్ ఇల్లు కూడా మునిగిపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇస్తే అక్రమ కట్టడాలను కూల్చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. హైదరాబాద్ ను ప్రపంచ ఐటీ హబ్ గా మారుస్తామని కేంద్ర హోంమంత్రి వాగ్ధానం చేశారు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

Back to top button