అప్పటి ముచ్చట్లు

‘ఎన్టీఆర్’ను అలా చూసి విచిత్రమైన అనుభూతి !

Peethambaramతెలుగు సినిమాకి ‘ఎన్టీఆర్’ రారాజుగా వెలిగిపోతోన్న రోజులు అవి. ప్రతి సినిమాకి ఎన్టీఆర్ చాల కొత్తగా కనిపిస్తున్నారనే పేరు వచ్చింది. దాంతో ఎన్టీఆర్ తన మేకప్ మెన్ పనితనానికి ముగ్దులయిపోయారు. ఆ మేకప్ మెనే ‘ఎం.పీతాంబరం’. ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలు ధరిస్తే, ఆ గెటప్ తాలూకు కటౌట్లకు థియేటర్ల వద్ద పాలాభిషేకాలు జరిగేవి అంటేనే పీతాంబరం టాలెంట్ ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.

ముఖ్యంగా ఎన్టీఆర్ ను కృష్ణుడిగా, రాముడిగా తయారు చేసేందుకు పీతాంబరం చాలా కష్టపడేవారట. పది మంది సహాయకులు బ్లూ పేస్టును కలిపి ఇస్తుంటే, ఎన్టీఆర్ శరీరమంతా దాన్ని పూసేటప్పటికి, పీతాంబరం వేళ్ళన్నీ నొప్పులు పుట్టేవట. అయితేనేం పూర్తి మేకప్ అయ్యాక ఎన్టీఆర్ ను చూసాక ఆ నొప్పులన్నీ మటుమాయమయ్యేవని ఆయన అప్పట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకోచ్ఛారు. అయితే ఒకసారి, ఎన్టీఆర్ కు మేకప్‌ చేసాక పీతాంబరంకు ఒక విచిత్రమైన అనుభూతి కల్గిందట.

ఒక సినిమా కోసం ఎన్టీఆర్ ను శ్రీరామునిలా తీర్చిదిద్దారు పీతాంబరం, ఆయన సహాయకుడు భద్రయ్యలు. పరమ నిష్టతో మేకప్‌ వేసిన తరువాత చూసుకుంటే.. ఎన్టీఆర్ అచ్చు గుద్దినట్టు శ్రీరామునిలా కనిపించేసరికి, మేకప్‌ కిట్టు వదిలేసి ‘జై శ్రీరామ్ జై శ్రీరామ్’ అని ఎన్టీఆర్‌ కాళ్లను చుట్టేసారు వాళ్ళిద్దరూ.

అప్పుడు సిబ్బంది, ఆ ఇద్దరిని అతికష్టంమీద పక్కకు చేర్చారు. చాలాసేపు మగతలోకి వెళ్లిపోయారు వాళ్ళు. స్వయంగా తమ చేతులతో తీర్చిదిద్దిన వారికే అలాంటి భ్రమ కలిగిందంటే.. శ్రీరాముని రూపంలో ఎన్టీఆర్ ఇక ప్రేక్షకులను ఎంతలా ప్రభావితం చేసి ఉండి ఉంటారో కదా.

Back to top button