కరోనా వైరస్

ఆ విధానంతో కరోనాను జయించిన బామ్మ.. ఎలా అంటే..?

కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ లో శరవేగంగా వైరస్ విజృంభిస్తోంది. వయస్సు పైబడిన వాళ్లు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధ పడేవాళ్లపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక వృద్ధురాలు మాత్రం ఆక్సిజన్ అవసరం లేకుండా కరోనా వైరస్ ను జయించారు. కేవలం 12 రోజుల్లోనే ఆక్సిజన్ లెవెల్స్ ను పెంచుకుని వృద్ధురాలు కరోనా నుంచి బయటపడ్డారు.

ప్రోనింగ్ పద్ధతి ద్వారా వృద్ధురాలు కరోనా వైరస్ ను జయించడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళితే యూపీకి చెందిన 82 సంవత్సరాల వయస్సు ఉన్న విద్య శ్రీవాస్తవకు కొన్నిరోజుల క్రితం కరోనా నిర్ధారణ ఆయింది. విద్య శ్రీవాస్తవ హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స తీసుకుంటున్న సమయంలో ఆమె ఆక్సిజన్ లెవెల్స్ ఏకంగా 79కి పడిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆమెను మంచంపై బోర్లా పడుకోబెట్టి కుటుంబ సభ్యులు ప్రోనింగ్ పద్ధతిలో శ్వాస తీసుకునేలా జాగ్రత్త పడ్డారు.

ప్రోనింగ్ విధానం వల్ల కేవలం నాలుగు రోజుల్లో ఆమె ఆక్సిజన్ లెవెల్స్ ఏకంగా 94 శాతానికి చేరుకున్నాయి. కేవలం ప్రోనింగ్ విధానం ద్వారానే ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడగా కేవలం 12 రోజుల్లో ఆమె కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. మంచంపై బోర్లా పడుకుని మెడ కింద భాగంలో మెత్తటి దిండును ఉంచి మోకాలి కింది భాగంలో మరో రెండు దిండ్లను ఉంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఒక్కో స్థానంలో అరగంట నుంచి రెండు గంటల వరకు పడుకోవడం వల్ల రోగి ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోజులో గరిష్టంగా 16 గంటల వరకు ప్రోనింగ్ చేయవచ్చు. మంచి వెంటిలేషన్ ఉన్న గదిలో సకాలంలో ప్రోనింగ్ చేయడం ద్వారా రోగి ప్రాణాలను కాపాడుకోవచ్చు.

Back to top button