పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జోరు మీదున్నాడు. వరుసగా నాలుగు సినిమాలు పట్టాలెక్కించి వరుసగా చేసుకుంటూ వెళుతున్నాడు. ‘వకీల్ సాబ్’ రిలీజ్ కు రెడీ అయిన వేళ.. ఇప్పుడు ‘అయ్యప్పమ్ కోషియమ్’తోపాటు క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘హరహర వీరమల్లు’ అనే సినిమాలోనూ పవన్ కళ్యాణ్ చరిత్రలో పోరాటయోధుడి పాత్రను పోషిస్తున్నాడు.
మొఘల్ కాలం నాటి కథతో రూపొందుతున్న ఈ చారిత్రక చిత్రానికి ‘హరహర వీరమల్లు’ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ చిత్రం కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ సెట్స్ నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు పవన్ హాజరవుతున్నారు.
తాజాగా ఇందులో మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడే వీరమల్లు అనే వజ్రాల దొంగ పాత్రలో పవన్ నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన పాత్ర ఎలాగుంటుందనే దానిపై పవన్ ఫ్యాన్స్ లో ఆసక్తి రేపుతోంది.
షూటింగ్ స్పాట్ నుంచి లీకైన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో పవన్ జానపద తరహా దుస్తులు ధరించి వీరుడిగా కనిపిస్తున్నాడు.
ఈ ఫొటోను పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. శివరాత్రి సందర్భంగా ఈ సినిమా అప్ డేట్ ఇస్తున్నట్లు చిత్రం యూనిట్ తెలిపింది.
పవన్ సరసన నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నండేజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.